క్యాన్సర్ పై అవగాహన పెంచాలి : మంత్రి దామోదర రాజనర్సింహ

క్యాన్సర్ పై అవగాహన పెంచాలి : మంత్రి దామోదర రాజనర్సింహ
  • బాధితులకు రెగ్యులర్​గా స్క్రీనింగ్  చేయాలి 
  • అధికారులకు మంత్రి దామోదర ఆదేశం
  • రాష్ట్రాన్ని క్యాన్సర్ రహితంగా చేసేందుకు నివేదిక ఇవ్వాలని సూచన

హైదరాబాద్, వెలుగు:  క్యాన్సర్​ను మొదటి దశలోనే గుర్తించేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. క్యాన్సర్​పై అవగాహన కోసం ప్రతి మెడికల్  కాలేజీలోనూ వర్క్ షాపులు నిర్వహించాలని సూచించారు. హెల్త్  సెక్రటరీతోపాటు  ప్రభుత్వ సలహాదారు డాక్టర్  నోరి దత్తాత్రేయతో కలిసి మంగళవారం వివిధ విభాగాల హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోడీలతో మంత్రి సమీక్ష  చేశారు. 

ఆయన మాట్లాడుతూ.. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)  నివేదిక ప్రకారం 2025 నాటికి రాష్ట్రంలో 55 వేల క్యాన్సర్  కేసులు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. క్యాన్సర్ రహిత తెలంగాణ లక్ష్యంతో ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక సమర్పించాలన్నారు. క్యాన్సర్  కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి, బాధితుల డేటాను స్పష్టంగా నమోదు చేయాలన్నారు. వ్యాధి నివారణకు పరిశోధనలు పెంచాలన్నారు.

 ‘‘రాజీవ్  ఆరోగ్యశ్రీ ద్వారా 90 శాతం క్యాన్సర్  చికిత్సలు కవర్  అవుతున్నా.. పూర్తి స్థాయిలో సేవలు అందేలా చర్యలు తీసుకోవాలి. నిమ్స్, ఎంఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జే ఆసుపత్రుల్లో మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించాలి. తొలి దశలోనే క్యాన్సర్  కేసులను గుర్తించి, జిల్లా ఆసుపత్రుల్లో చికిత్స అందించాలి. క్షేత్రస్థాయిలో క్యాన్సర్  స్క్రీనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  నిర్వహించి, వ్యాధి దశలను బట్టి స్పెషాలిటీ కేంద్రాలకు రిఫర్  చేయాలి. నిమ్స్,  ఎంఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జేలో అందుబాటులో ఉన్న సేవలపై ప్రచారం చేస్తూ  ప్రజలకు అవగాహన కల్పించాలి” అని మంత్రి అన్నారు.