
సంగారెడ్డి/ఝరాసంగం, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో ఈనెల 23న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా మంగళవారం మంత్రి దామోదర రాజనర్సింహ కలెక్టర్ క్రాంతితో కలిసి సంగారెడ్డి కలెక్టరేట్ లో అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో అభివృద్ధిలో జిల్లా రూపురేఖలు మారుతాయన్నారు. ఇప్పటికీ నిర్దేశించిన పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మరికొన్ని అభివృద్ధికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేయనున్నట్టు మంత్రి తెలిపారు.
సీఎం పర్యటన కోసం రూట్ మ్యాప్ ప్లాన్, సెక్యూరిటీ, బందోబస్తు, బారికేడ్లు, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీటి సౌకర్యం, హెలీప్యాడ్, హెల్త్ క్యాంపులు తదితర సౌకర్యాలను పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎస్పీ పరితోశ్ పంకజ్, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రూ.500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
జహీరాబాద్ పట్టణంతో పాటు, ఝరాసంగం మండలంలో సుమారు రూ.500 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించిన కార్యాచరణను అధికారులు రూపొందించారు. 65వ నేషనల్ హైవే నుంచి ఝరాసంగం నీమ్జ్ ప్రాజెక్టు వరకు రూ.100 కోట్లతో 9.5 కిలోమీటర్ల మేర నిర్మించిన ఫోర్ లైన్ రోడ్డు, మాచ్నూర్ లో రూ.26 కోట్లతో 11.8 ఎకరాల్లో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనం, రూ.100 కోట్లతో నిర్మించిన జహీరాబాద్ రైల్వే బ్రిడ్జి ప్రారంభోత్సవం, బసవేశ్వర విగ్రహా ఆవిష్కరణతో పాటు మరో రూ.250 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేయనున్నారు. పలు సంక్షేమ, అభివృద్ధికి సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. నీమ్జ్ ప్రాజెక్టు వద్ద సీఎం బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.