
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటళ్లలో మెడిసిన్స్ కొరత లేకుండా చూసుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులకు మంత్రి దామోదర రాజనర్సింహా సూచించారు. కొన్ని హాస్పిటళ్లలో మందులు ఇవ్వడం లేదని పేషెంట్ల నుంచి కంప్లైంట్లు వస్తున్నాయని, అందుకు కారణాలేంటో గుర్తించి సంబంధిత సిబ్బందిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీ విషయంలో రాజీపడొద్దని ఫుడ్ సేఫ్టీ అధికారులకు సూచించారు.
ఈ మేరకు కోఠీలోని మెడికల్ కార్పొరేషన్ ఆఫీసులో ఆరోగ్యశాఖ, డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులతో మంత్రి రివ్యూ చేశారు. పుడ్ సేఫ్టీ ఆఫీసర్ల కొరత ఉందని అధికారులు చెప్పగా.. అవసరమైనంత మందిని నియమిస్తామని తెలిపారు. నకిలీ వ్యవస్థను అరికట్టకపోతే జనాల ప్రాణాలకు ముప్పే అంటూ మంత్రి వ్యాఖ్యానించారు.
ఎన్నికల కోడ్ పూర్తయ్యాక అన్ని హాస్పిటల్స్, మెడికల్, నర్సింగ్ కాలేజీలలో ఆకస్మిక తనిఖీలు చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు. సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు.