ప్రజలకు మంత్రి దామోదర దీపావళి శుభాకాంక్షలు

ప్రజలకు మంత్రి దామోదర దీపావళి శుభాకాంక్షలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజలకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రతి ఇంట్లో జ్ఞానం, సంతోషం, శ్రేయస్సుల వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని లక్ష్మీదేవిని ప్రార్థిస్తున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ దీపావళి రాష్ట్ర ప్రజలకు కొత్త ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని అందించాలన్నారు. 

పండుగ సందర్భంగా ప్రజలు బాణాసంచా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, సురక్షితంగా వేడుకలు జరుపుకోవాలని సూచించారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, పసి పిల్లలను పటాకులకు దూరంగా ఉంచాలన్నారు. కాగా, దీపావళి పండుగ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్పిటళ్లలో డాక్టర్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. 

హైదరాబాద్‌‌‌‌లోని సరోజినీ దేవి కంటి హాస్పిటల్‌‌‌‌తో పాటు ఇతర హాస్పిటళ్లలోని కంటి చికిత్స విభాగాల్లో 24 గంటలూ డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండాలని చెప్పారు. బాణాసంచా ప్రమాదాల వల్ల కంటి గాయాలు, కాలిన గాయాలతో వచ్చే వారికి తక్షణమే వైద్యం అందించాలని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు ఆదేశించారు.