రెండేళ్లలో ఉస్మానియా, గాంధీకి హాస్టల్ బిల్డింగ్స్‌‌‌‌‌‌‌‌

రెండేళ్లలో ఉస్మానియా, గాంధీకి హాస్టల్ బిల్డింగ్స్‌‌‌‌‌‌‌‌
  • 10 రోజుల్లో నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తం
  • మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడి
  • డాక్టర్లు సేవా దృక్పథంతో పనిచేయాలని సూచన

హైదరాబాద్, వెలుగు : ఉస్మానియా, గాంధీ మెడికల్  కాలేజీల్లో హాస్టల్  భవనాల నిర్మాణాలకు 10 రోజుల్లో శంకుస్థాపన చేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. కాకతీయ మెడికల్  కాలేజీకి ఇటీవల మంజూరు చేసిన రోడ్లు, ఇతర పనులను కూడా ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. సోమవారం మినిస్టర్ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో మీడియాతో  ఆయన మాట్లాడారు. 10  రోజుల్లో భవన నిర్మాణలకు శంకుస్థాపన చేసి, రెండేళ్లలో నిర్మాణ పనులను పూర్తి చేస్తామన్నారు. దవాఖాన్లు, కాలేజీల్లో మౌలిక సదుపాయాలతో పాటు..

హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్  కూడా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అవసరమైన మేర స్టాఫ్  లేరని, ఆ సంఖ్యను సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు. హాస్పిటల్స్ కి 24 అంతస్తులు కట్టడం ముఖ్యం కాదని,సేవలు ఎలా అందుతున్నాయో ముఖ్యం అని పరోక్షంగా గత సర్కారు‌‌‌‌‌‌‌‌కు మంత్రి చురకలు అంటించారు. ఆరోగ్య శాఖ ప్రక్షాళన జరుగుతోందన్నారు. హెచ్‌‌‌‌‌‌‌‌ఓడీలతో సరిగా పనిచేయించుకుంటామని, వారి నియామకంలో సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటామన్నారు.

నీట్‌‌‌‌‌‌‌‌ను రద్దు చేయాలా, వద్దా అనే దానిపై ఆరోగ్యకర చర్చ జరగాల్సిన అవసరం ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. సోమవారం ‘డాక్టర్స్ డే’ కావడంతో మంత్రి డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. పబ్లిక్  హెల్త్  డాక్టర్స్‌‌‌‌‌‌‌‌  అసోసియేషన్  ప్రతినిధులు తెచ్చిన కేక్ ను కట్  చేశారు. డాక్టర్లంతా సేవా దృక్పథంతో పనిచేయాలని సూచించారు.