మున్సిపాలిటీలకు ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పరిధి విస్తరణ

మున్సిపాలిటీలకు ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్  పరిధి విస్తరణ

తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీలకు ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్  పరిధిని వర్తించేలా విస్తరించాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్ట్ విస్తరణలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా సర్వే చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు. తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ బోర్డ్ మీటింగ్ ఇవాళ టీ-హబ్ లో జరిగింది. ఈ బోర్డు సమావేశంలో పలు నిర్ణయాలను తీసుకున్నారు.   ఇప్పటికే ప్రతి ఇంటికి ఇంటర్నెట్ ఇవ్వాలనే దీర్ఘకాలిక లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి తెలిపారు. ఫైబర్ గ్రిడ్ పనుల పురోగతిని ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ పనులు పూర్తయిన గ్రామీణ ప్రాంతాల్లో టి ఫైబర్ పనులు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయని, ఈ ఏడాది అగస్టు నాటికి ప్రతి గ్రామానికి టి-ఫైబర్ కనెక్టివిటి అందించే లక్ష్యంతో పనిచేస్తున్నామని అధికారులు మంత్రికి తెలిపారు.

రాష్ట్రంలోని 30 వేల ప్రభుత్వ కార్యాలయాలకు జూన్ నుండి ప్రాధాన్యత క్రమంలో కనెక్ట్ చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. సీఎం కేసీఆర్ సూచనతో రాష్ట్రంలోని అన్ని రైతు వేధికలను టిఫైబర్ తో కనెక్ట్ చేయాలని సూచించారు. దీంతో ప్రతి రైతుకి ఇంటర్నెట్ పలితాలు అందించే వీలవుతుందన్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా 5 రైతు వేదికలకు కనెక్టివిటీని అందించామని టి ఫైబర్ టీం మంత్రికి  తెలిపారు. బ్రాడ్ బ్యాండ్ సౌకర్యాన్ని ఒక యుటిలిటీగా పరిగణించే అంశాన్ని పరిశీలించి..దీని ద్వారా రాష్ట్రంలోని పట్టణాల్లోని ప్రతి ఇంటికి బ్రాడ్ బ్యాండ్ చేరుకునే విధానాన్ని స్టడీ చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి కేటీఆర్.