జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : మహిళలకు ఉచిత బస్సు వద్దు అన్న ప్రతిపక్షాలకు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. ఆదివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల పేరుతోనే పథకాలను ప్రవేశపెడుతోందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నియోజవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి, నిర్మాణాల్లో వేగం పెంచామని చెప్పారు.
ఇందిరా మహిళా శక్తి కింద గ్రామీణ ప్రాంత మహిళలకు నాణ్యమైన చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు. పట్టణ ప్రాంత మహిళలకు సైతం నెల రోజుల తర్వాత చీరలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను గెలిపించిన మాదిరిగానే.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు అండగా నిలవాలని కోరారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ సంకీర్త్, జాయింట్ కలెక్టర్ అశోక్‌కుమార్, డీఆర్డీఏ పీడీ బాలకృష్ణ, గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబుగౌడ్, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు.
