నాపై ఆరోపణలు చేయించిదెవరో త్వరలోనే తెలుస్తుంది

నాపై ఆరోపణలు చేయించిదెవరో త్వరలోనే తెలుస్తుంది
  • బరాబర్ రాజకీయాల్లో ఉంటా.. రాజకీయమే చేస్తా
  • మా టీవీ, మా పేపర్ నాపై విషం కక్కడం దుర్మార్గం
  • తెలంగాణ ప్రజలు ఎడ్డొల్లు, గుడ్డొళ్ళు అనుకోవటం కరెక్ట్ కాదు

తనపై వచ్చిన ఆరోపణలపై నిజనిర్ధారణ జరిపించాలని మంత్రి ఈటల రాజేందర్ మరోసారి డిమాండ్ చేశారు. తన భూముల పక్కన అసైన్డ్  ల్యాండ్స్ ఉన్న మాట వాస్తవమేనని.. అయినా కూడా ఒక్క ఎకరా భూమి కూడా తన కబ్జాలో లేదని ఆయన అన్నారు. తాను భూకబ్జా చేశానంటూ తమ పార్టీ పత్రిక, టీవీలో రావటం బాధాకరమని ఆయన వాపోయారు. తెలంగాణ ప్రజలు గొర్లు, ఎడ్డివాళ్లనుకుంటే పొరపాటేనని ఆయన అన్నారు. డబ్బులిచ్చి తనపై ఆరోపణలు చేయించినవాళ్లు ఎవరో మున్ముందు బైటపడుతుందని ఆయన అన్నారు. నయీం లాంటి వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తేనే భయపడని తాను.. ఇలాంటి ఎంక్వైరీలకు భయపడేది లేదని తేల్చి చెప్పారు.

‘నాపై వచ్చిన ఆరోపణలపై విచారణకు నేను సిద్ధంగానే ఉన్నాను. అన్ని పార్టీల నేతలు నా ఫాం దగ్గరకు వచ్చి.. పరిశీలించి.. నిజ నిర్ధారణ చేసి ప్రజలకు చెప్పాలి అని కోరుతున్నా. నిజంగా నేను కబ్జా చేసి షెడ్ కట్టి ఉంటే కూల్చేయవచ్చు. తెలంగాణ ప్రజలు ఎడ్డొల్లు, గుడ్డొళ్ళు అనుకోవటం కరెక్ట్ కాదు. వాస్తవం తెలుస్తది. కొన్ని న్యూస్ ఛానల్‌లను తీసుకెళ్ళి మరీ నామీద కబ్జా వార్తలు ప్రసారం చేయించారు. నిజానిజాలు బయటికి వస్తాయి. సంస్కారవంతమైన మనుషులు అయితే నామీద ఇలాంటి ఆరోపణలు చేయించరు. కొన్ని విషయాలపై ఓపెన్‌గా మాట్లాడుతాను. కాబట్టి కొందరు మనసు నొచ్చుకొని ఉండొచ్చు. నేను ఎవరికీ భయపడను. మా టీవీ, మా పేపర్ నాపై విషం కక్కడం దుర్మార్గం. రాజేంద్ర ఎవరికి భయపడడు. నయీంకే భయపడలేదు. ఎవరో ఏదో చేశారని రాజేందర్ రాజకీయాలనుంచి తప్పుకుని వెర్రి వెంగలప్పలాగా ఉండడు. బరాబర్ రాజకీయాల్లో ఉంటా. నాపై విచారణ ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు. నేను ఆ భూములు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నా. ఇది తప్పయితే.. రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు కూడా తప్పు చేసినట్లే. సమగ్ర విచారణకు నేను సిద్దంగా ఉన్నా. దుర్మార్గంగా మాట్లాడే వాళ్ల గురించి నేను మాట్లాడను. 20 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నాను. రాజకీయం వదిలేసి రాజేంద్ర జంగమయ్యలాగా ఉండడు.. రాజకీయమే చేస్తాడు’ అని ఆయన అన్నారు.