రాష్ట్రానికి కేంద్రం 12 కోట్ల పనిదినాలు ఇచ్చింది : మంత్రి దయాకర్ రావు

రాష్ట్రానికి కేంద్రం 12 కోట్ల పనిదినాలు ఇచ్చింది : మంత్రి దయాకర్ రావు
  • ఉపాధి నిధులతో జీపీ బిల్డింగ్స్, సీసీ రోడ్లు నిర్మిస్తం: మంత్రి దయాకర్ రావు 

హైదరాబాద్, వెలుగు: జాతీయ ఉపాధి పథకం ద్వారా  ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం మన రాష్ట్రానికి 12 కోట్ల పనిదినాలు ఇచ్చిందని పంచాయతీ రాజ్ మంత్రి దయాకర్ రావు వెల్లడించారు. గురువారం ఆయన సెక్రటేరియెట్​లో ఉపాధి స్కీమ్​తో పాటు డిపార్ట్​మెంట్​పై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. పనిదినాల ద్వారా వచ్చే మెటీరియల్ కంపోనెంట్​తో అవసరమైన చోట కొత్త గ్రామ పంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడానికి నిధులు ఖర్చు చేయాలని ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. 

పీఆర్ ఇంజినీరింగ్ విభాగంలో అర్హులైన అందరికీ త్వరలోనే పదోన్నతులు వస్తాయని చెప్పారు. కొత్తగా 750 పోస్టులు శాంక్షన్ అవుతాయని, త్వరలో నోటిఫికేషన్ విడుదల అవుతుందని వివరించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల(జేపీఎస్) పనితీరుపై వేసిన కమిటీ రిపోర్ట్ ఇంకా అందలేదని తెలిపారు. రిపోర్ట్ రాగానే వారిని విడతల వారీగా రెగ్యులర్ చేస్తామని మంత్రి వెల్లడించారు. 

రివ్యూలో పీఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, పీఆర్ డైరెక్టర్ హనుమంతరావు, ఈఎన్సీ సంజీవరావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.