కేంద్రం వైఖరి రాష్ట్రానికి శాపంగా మారింది : ఎర్రబెల్లి

కేంద్రం వైఖరి రాష్ట్రానికి శాపంగా మారింది : ఎర్రబెల్లి

కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరి రాష్ట్రానికి శాపంగా మారిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మోడీ సర్కారు ఉపాధి హామీ నిధులను పేద ప్రజలకు దూరం చేసే కుట్ర చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర విధానాల వల్ల సర్పంచ్‭లు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో ఇచ్చిన హామీని కేంద్రం విస్మరించిందని విమర్శించారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఎర్రబెల్లి మండిపడ్డారు. డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ది బాధ్యత తాను తీసుకుంటానని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని.. దేశం రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతనే అన్ని నియోజకవర్గాలకు సాగు నీరు అందుతోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, 24 గంటల కరెంటు వల్ల రైతులు లాభపడుతున్నారన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో మోటర్లకు మీటర్లు పెట్టాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. దేశంలో రైతు బంధు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్న ఎర్రబెల్లి.. సీఎం కేసీఆర్ ఖమ్మంలో నిర్వహించే సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.