పాలన సౌలభ్యం కోసమే పీఆర్​లో మార్పులు

పాలన సౌలభ్యం కోసమే పీఆర్​లో మార్పులు

హైదరాబాద్, వెలుగు: పరిపాలన సౌలభ్యం కోసమే పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంను రీషఫ్లింగ్ చేశామని  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అధికారులకు ప్రమోషన్లు రావటంతోపాటు ఖాళీ పోస్టుల్లో  కొత్తవారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఆదివారం ఖైరతాబాద్ జడ్పీ ఆఫీస్ లో, ఉప్పల్ లో  కొత్తగా ఏర్పాటు చేసిన పీఆర్ డివిజన్ ఆఫీసులను ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా,  ఈఎన్సీ సంజీవరావుతో కలిసి మంత్రి ప్రారంభించారు.  రాష్ట్రవ్యాప్తంగా 87 కొత్త కార్యాలయాలు ఏర్పాటు అయ్యాయని, సీఈ, సర్కిల్, డివిజన్, సబ్ డివిజన్ ఆఫీసుల్లో  కొత్త అధికారులు బాధ్యతలు చేపట్టారని ఆయన తెలిపారు.

  రాష్ట్రంలో మొత్తం 237 ఇంజినీరింగ్ కార్యాలయాలు ఉండగా,  మిషన్ భగీరథతో పాటు పంచాయతీరాజ్ కార్యకలాపాలు విస్తరించామన్నారు. దీంతో కొత్త కార్యాలయాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్  నిర్ణయించారన్నారు. ఇప్పటికే  అధికారులకు పదోన్నతులు కల్పించామని తెలిపారు. ఏఈ స్థాయితో పాటు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం 740 ఖాళీ అయ్యాయని,  త్వరలోనే వీటిని భర్తీ చేస్తామని చెప్పారు. కాగా, కాళోజీ జయంతి సందర్భంగా వరంగల్​కు చెందిన డైరెక్టర్ ప్రభాకర్ జైని నిర్మించిన  ప్రజా కాళోజీ డాక్యుమెంటరీని అద్భుతంగా ఉందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.