
మెగా టెక్స్టైల్ పార్కు రైతులకు మంత్రి ఎర్రబెల్లి వార్నింగ్
కోర్టుకు పోయినవాళ్లు కాంప్రమైజ్‌కు రావాలె
లేకపోతే వసతులు కూడా ఇప్పించకుంట చేస్తామన్న మంత్రి
పంటలను చూసి కంపెనీలు పోతున్నయ్: ఎమ్మెల్యే ధర్మారెడ్డి
వరంగల్ కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ భూసేకరణలో కోర్టులకు పోయినవారు కాంప్రమైజ్ కావాలని, లేదంటే వారిని ముప్పుతిప్పలు పెడుతామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. కాంప్రమైజ్కాకపోతే వసతులు కూడా ఇప్పించబోమని, సహకరించనివాళ్లను దగ్గరకు రానియ్యబోమని అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం చింతలపల్లిలో జరుగుతున్న మెగా టెక్స్ టైల్ పార్కు పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. భూ సేకరణ, ఇతర సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘‘పరకాల ఎమ్మెల్యే నాకు చాలా విషయాలు చెప్పిండు. నేను కూడా చాలా విషయాలు గమనించిన. పార్కు రాకముందు ఇక్కడ భూములకు తక్కువ రేట్లు ఉండవచ్చు. ఇప్పుడు మంచి రేటు రావొచ్చు. అయ్యో..మేం అంత తక్కువ ధరకే భూములను ఇచ్చామా..అనే ఆలోచన కొందరిలో రావొచ్చు. అలాంటి రైతులు ప్రస్తుతం తమ భూములు ఇవ్వడానికి ఆలోచిస్తున్నరు. మరికొందరేమో కోర్టులకు పోతున్నరు”అని అన్నారు. ల్యాండ్ ఇష్యూ మొత్తం క్లియర్ చేయడానికి ఎంత గడువు కావాలని జిల్లా కలెక్టర్ హరితను ప్రశ్నించారు. స్పందించిన ఆమె.. కుటుంబ గొడవలతో ఆగిన భూములను 20 రోజుల్లోగా, కోర్టు కేసుల్లో ఉన్నవాటికి రెండు నెలల్లోగా పరిష్కారం చూపుతామన్నారు.
కేసీఆర్ సూచన మేరకు తాను ఆఫీసర్లతో రివ్యూ ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ‘‘కోర్టుకు పోయినవాళ్లు కాంప్రమైజ్కువస్తే ఫర్వాలేదు. కాంప్రమైజ్‌కు రాకపోతే ముప్పుతిప్పలు పెట్టి.. వీళ్లకు వచ్చిన వసతులు కూడా ఇప్పించకుంట చేస్తం” అని అన్నారు. ఉన్నతాధికారులు ఏం చేస్తారో తనకు తెలియదని, మూడు నెలల్లోగా పార్కు పనులకు రూపం రావాలని ఆయన ఆదేశించారు. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా ఉండే మెగా టెక్స్ టైల్ పార్కును సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లాకు కేటాయించడం గర్వకారణమని, పనులు పూర్తయితే ఉద్యోగాలు వస్తాయని, ఇప్పుడు భూములు ఇస్తున్న రైతు కుటుంబాలు సంతోషంగా ఉంటాయని పేర్కొన్నారు. కోర్టు కేసుల్లో ఉన్న రైతుల విషయమై మరోమారు మాట్లాడుతూ..‘‘సహకరించేటోళ్ల కుటుంబాలు బాగుంటయ్.. ఎవరైతే సహకరించకుండా చెడగొడతరో వారిని దగ్గరికి కూడా రానియ్యం” అని మంత్రి తేల్చిచెప్పారు.