‘మిషన్ భగీరథ’ సిబ్బంది, ఇంజనీరింగ్ అధికారులకు సన్మానం

‘మిషన్ భగీరథ’ సిబ్బంది, ఇంజనీరింగ్ అధికారులకు సన్మానం

వరంగల్ : ‘మిషన్ భగీరథ’ కార్యక్రమం అమలు తీరు చూసే తాను టీఆర్ఎస్ పార్టీలో చేరానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టే సమయానికి మిషన్ భగీరథ స్థిరీకరణ జరిగిందని, ఇప్పుడు కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయని చెప్పారు. మిషన్ భగీరథ అమలు కోసం రూ.19వేల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా.. కేంద్రం పక్కన పెట్టిందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి 53 అవార్డులు వచ్చాయని తెలిపారు. గతంలో గంగదేవిపల్లి గ్రామం ఒక్కటే ఆదర్శ గ్రామంగా ఉండేదని, ఇప్పుడు చాలా గ్రామాలు కూడా ఆదర్శ గ్రామాలుగా రికార్డుల్లోకెక్కాయని చెప్పారు. దేశంలో 20 ఆదర్శ గ్రామాలను ఎంపిక చేస్తే.. అందులో 19 గ్రామాలు తెలంగాణకు చెందినవే కావడం తమకు గర్వంగా ఉందన్నారు. 

తాగునీటిని అందించడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. వ్యవసాయ బావుల వద్ద మోటార్లు, ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోయేవని అన్నారు. తాను అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉండగా తాగునీటి ఇబ్బందులపై చాలాసార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించానని, ఆ సమయంలో కేసీఆర్..కాస్త ఓపిక పట్టమని చెప్పారని అన్నారు. 

అందరి కృషి ఉంది

కేంద్రం నుంచి రాష్ట్రానికి అవార్డులు రావడంలో అందరి కృషి ఉందని ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్‌ చెప్పారు. ఈ సందర్భంగా ‘మిషన్ భగీరథ’ సిబ్బందికి, అధికారులకు ఆమె అభినందనలు తెలియజేశారు. వివిధ విభాగాల్లో అవార్డులు పొందిన పలువురు ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బందికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందించారు.