వరదలు రాకుండా చర్యలు తీసుకోండి

వరదలు రాకుండా చర్యలు తీసుకోండి

హన్మకొండ జిల్లా: నగరం ముంపుకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి అధికారులను ఆదేశించారు. మంగళవారం హన్మకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో  వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై వరంగల్, హనుమకొండ జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ... నగరంలోని వడ్డేపల్లి, భద్రకాళి, న‌యింనగర్, బొందివాగు, శాఖరాశికుంట ప్రధాన నాలాలను పూర్తి స్థాయిలో శుభ్రం చేయాలన్నారు. నాలాల విషయంలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్నారు. నాలాలపై ఉన్న ఆక్రమణలు వెంటనే తొలగించాలని,  కోర్ట్ కేసులను త్వరగా పరిష్కరించేలా ప్రత్యేక అడ్వకేట్  ద్వారా చర్యలు తీసుకోవాలని చెప్పారు. 

నాలాల్లో ఉన్న చెత్త చెదారం పూర్తిగా తొలగించాలని, ఎట్టి పరిస్థితుల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వర్షాల వల్ల ఎలాంటి అనర్థాలు జరగకుండా చూడటానికి డీఆర్ఎస్ బృందాలు, మాన్సూన్ టీంలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. టోల్ ఫ్రీ నంబర్ 1800 425 1980 పై విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. ఈ సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్,  మేయర్ గుండు సుధారాణి, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు బండా ప్రకాష్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అరూరి రమేష్, కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, డాక్టర్ గోపి, జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ ప్రావీణ్య, కుడా చైర్మన్ సుందర్ రాజ్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, బల్దియా, రెవిన్యూ, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.