మరిన్ని బెడ్ల కోసం ప్రైవేట్ సాయం తప్పదేమో

మరిన్ని బెడ్ల కోసం ప్రైవేట్ సాయం తప్పదేమో

రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగి.. మరిన్ని బెడ్స్‌‌‌‌ అవసరం వస్తే ప్రైవేట్ టీచింగ్ హాస్పిటళ్లను వాడుకుంటామని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసిన నేచర్ క్యూర్ హాస్పిటల్‌‌‌‌ను, గచ్చిబౌలిలోని టిమ్స్‌‌‌‌ను, సికింద్రాబాద్‌‌‌‌లోని గాంధీ హాస్పిటల్‌‌‌‌ను మంత్రి ఈటల బుధవారం పరిశీలించారు. ఆయా హాస్పిటళ్ల ఇన్‌‌‌‌చార్జ్‌‌‌‌లు, డాక్టర్లతో మంత్రి భేటీ అయ్యారు. గాంధీలో కరోనా బెడ్ల సంఖ్యను పెంచాలని సూచించారు. టిమ్స్‌‌‌‌ వద్ద మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖాన్లలో అన్ని సౌకర్యాలు కల్పించామని, మందులు, మ్యాన్‌‌‌‌పవర్‌‌‌‌ కొరత లేదని అన్నారు. డాక్టర్లు, స్టాఫ్‌‌‌‌ తక్కువగా ఉన్న చోట టెంపరరీ నియామకాలు చేపడుతున్నామని చెప్పారు. కేసులు పెరుగుతుండడంతో సర్కారు దవాఖానల్లో కరోనా బెడ్ల సంఖ్యనూ పెంచామని చెప్పారు. ప్రభుత్వ దవాఖాన్లలో సుమారు పది వేలు, ప్రైవేటులో పది వేల బెడ్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రైవేట్ టీచింగ్ హాస్పిటళ్లలో మరో 14 వేల బెడ్లు అందుబాటులో ఉన్నాయని, వాటిని కరోనా రోగుల కోసం కేటాయించేందుకు యాజమాన్యాలు ఒప్పుకున్నాయన్నారు. 

ఈ టైమ్‌‌‌‌లో ధర్నాలు దుర్మార్గం

ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటళ్లు చివరి స్టేజ్‌‌‌‌లో ఉన్న కరోనా రోగులను గాంధీకి పంపిస్తున్నాయని, అందువల్లే గాంధీలో డెత్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయని ఈటల అన్నారు. ఇకనైనా ప్రైవేట్‌‌‌‌, కార్పొరేట్ వాళ్లు ఈ విధానాన్ని మానుకోవాలని, పేషెంట్‌‌‌‌ను బతికించేందుకు చివరి వరకూ ప్రయత్నించాలని, మధ్యలోనే ఇలా పంపొద్దని ఆయన సూచించారు. కాగా, కరోనా వార్డుల్లో డ్యూటీ చేసే డాక్టర్లు, సిబ్బందికి క్వారంటైన్ లీవ్స్ ఇవ్వాలని బుధవారం కింగ్‌‌‌‌ కోఠి హాస్పిటల్‌‌‌‌లో స్టాఫ్‌‌‌‌ ధర్నా చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. ఈ సమయంలో ధర్నాలు చేయడం కంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదన్నారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, ధర్నాలు పెట్టొద్దని సూచించారు.