చదువుకున్నవారికి ఉద్యోగాలు రావడంలేదు

చదువుకున్నవారికి ఉద్యోగాలు రావడంలేదు

చదువును వ్యాపారంగా మార్చేసిన్రు: మంత్రి ఈటల

  •     అణచివేత, హక్కుల ఉల్లంఘన ఉన్నచోటే ఉద్యమాలుంటయ్
  •     మనిషిని కులంతో చూసే నీచమైన కల్చర్  బాధాకరం 
  •     దుర్మార్గాలు ఏ పార్టీలో ఉన్నా వ్యతిరేకించాలె 
  •     పూలే జయంతి వేడుకలో మంత్రి కామెంట్స్

 కొట్లాడితేనే హక్కులు వస్తాయి తప్ప.. అడుక్కుంటే రావని హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ అన్నారు. అణచివేత, హక్కుల ఉల్లంఘన, పేదరికం ఎక్కడ ఉంటే అక్కడ తప్పకుండా తిరుగుబాట్లు ఉంటాయన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్ అంబర్ పేట అలీకేఫ్ చౌరస్తాలోని పూలే విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. మహనీయుల జయంతులు, వర్ధంతులు మన బాధ, ఆవేదనలను చెప్పుకునే సందర్భాలుగానే మిగిలిపోతున్నాయన్నారు. రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడంలో, దాని అమలులో పాలకులు విఫలమైనందువల్లే 70 ఏండ్ల తర్వాత కూడా రిజర్వేషన్లు, అంతరాలు, అణచివేతల గురించి మాట్లాడాల్సి వస్తోందని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని కులం మనదేశంలోనే ఉందని, కులంతో కూడా మనిషిని, మేధాశక్తిని అంచనా వేసే నీచమైన కల్చర్ ఉండటం బాధాకరమన్నారు. మంచి కల్చర్, సంప్రదాయాలను గౌరవిస్తామని, కానీ సంస్కారంలేని విషయాలనే ప్రశ్నిస్తామన్నారు.
 
ఫస్ట్ జనరేషన్ పిల్లలకు జాబ్స్ రాలె

‘‘చదువుకుంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని అనుకున్నం. కానీ మా ఊళ్లో పెద్ద చదువులు చదువుకున్న మా కొమురన్న కొడుక్కి కొలువు రాలె. మా మల్లన్న కొడుక్కీ ఉద్యోగం రాలె. ఫస్ట్ జనరేషన్ పిల్లలకు జాబ్స్  రాలె. సమాజంలో సమానత్వం రాకపోగా.. అంతరాలు పోకపోగా మరింత పెరిగాయనడానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లే ఉదాహరణ. మనం బాగుపడ్డమా.. బతికి చెడినమా? అనే విషయంలో ఇప్పుడు చర్చ జరగాలి. సమాజంలో చైతన్యం సచ్చిపోదు. చైతన్యం సచ్చిపోతే ఉన్మాదం వస్తదని చాలా సార్లు చెప్పిన. ఇవ్వాళ ఆ ఉన్మాదాన్ని రాకుండా చూడాల్సిన బాధ్యత మనలాంటి సంఘాలు, వ్యక్తులపైనే ఉంది” అని ఈటల చెప్పారు. మహనీయులు స్ఫూర్తితో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.  

ఉన్నోళ్లకు కార్పొరేట్ కాలేజీలు, లేనోళ్లకు సర్కారు స్కూళ్లు

పైసలున్నోళ్లకు డీమ్డ్ యూనివర్సిటీలు, ఓక్రిడ్జ్స్కూళ్లు, కార్పొరేట్ కాలేజీలుంటే.. లేనోళ్లకు గవర్నమెంట్ స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, ఉస్మానియా యూనివర్సిటీ వంటివి ఉన్నాయని ఈటల అన్నారు. గవర్నమెంట్ యూనివర్సిటీలు ఎట్లున్నయో.. ప్రైవేట్ డీమ్డ్ వర్సిటీలు ఎట్లున్నయో.. అక్కడికి వెళ్లి చూస్తే అర్థం అవుతుందని చెప్పారు. ‘‘హన్మంతన్న (వీహెచ్), కృష్ణమోహన్, కాలేరు వెంకటేష్చదివినప్పుడు యూనివర్సిటీలు ఎట్లుండె? ఇప్పుడు ఎట్లున్నయ్? గమనించాలె. ఓయూలో ఇవ్వాళ పేద పిల్లలు మాత్రమే ఉన్నారు. డీమ్డ్ వర్సిటీల్లో పెద్దవాళ్ల పిల్లలు ఉన్నారు. ఇప్పుడు చదువును కూడా వ్యాపారం చేశారు” అని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇవ్వాళ 95% ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టార్ లోనే ఉన్నాయని, కానీ ఆ సెక్టార్ లో రిజర్వేషన్లు లేవన్నారు. పేదలకు జరుగుతున్న అన్యాయంపై డిబేట్ జరగాలని, ఏ పార్టీలో ఉన్నా.. దుర్మార్గాలను వ్యతిరేకించాలన్నారు. కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ.. అంబర్ పేట్ చే నెంబర్ సర్కిల్లోని ప్రభుత్వ స్థలంలో ఆడిటోరియం కట్టాలని సీఎంను కోరామని, ఈ విషయంలో చొరవ తీసుకోవాలని ఈటలను కోరారు. కార్యక్రమంలో అంబర్పేట కాలేరు ఎమ్మెల్యే వెంకటేశం, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, బీసీ సంఘం నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.