మెదక్ జిల్లాలో మంత్రి వివేక్ పర్యటన.. పటాన్ చెరు ప్రజలకు వరాలు

మెదక్ జిల్లాలో మంత్రి వివేక్ పర్యటన.. పటాన్ చెరు ప్రజలకు వరాలు
  •     మేమొక్కటే.. మాది కాంగ్రెస్ వర్గం..  
  •     నీలం మధు, కాటా ప్రకటన 

సంగారెడ్డి/పటాన్ చెరు/అమీన్ పూర్/ జిన్నారం, కొండపాక/ వెలుగు: పటాన్ చెరు నియోజకవర్గ ప్రజలకు కార్మిక శాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా ఇన్ చార్జీ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి వరాలు కురిపించారు. ఇస్నాపూర్, ఇంద్రేశం, గుమ్మడిదల, జిన్నారం, గడ్డపోతారం మున్సిపల్ పరిధిలో పెండింగ్ ఫండ్స్ తో పాటు పెండింగ్ నామినేటెడ్ పదవుల భర్తీకి భరోసా ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్, జిన్నారం మున్సిపాలిటీల్లో పర్యటించిన మంత్రికి కాంగ్రెస్ నాయకులు వినతి పత్రాలిచ్చారు. వెంటనే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 

ఇస్నాపూర్ మున్సిపాలిటీకి నిలిచిపోయిన రూ.15 కోట్ల ఫండ్స్ రిలీజ్ చేయిస్తానని, పటాన్ చెరులో మహిళల కోసం పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు రాని నేతలకు సముచిత స్థానం కల్పించే బాధ్యత తీసుకుంటానన్నారు. స్థానిక నేతల కోరిక మేరకు పటాన్ చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి శివానందంకు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఈమేరకు అప్పటికప్పుడే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మెసేజ్ పంపారు. 

మేమిద్దరం ఒక్కటే..  మాది కాంగ్రెస్ వర్గం..! 

మేమిద్దరం ఒక్కటే.. మా ఇద్దరిలో ఏ వర్గాలు లేవు.. మాది కాంగ్రెస్ వర్గమే అని మెదక్ ఎంపీ కాంటెస్ట్ అభ్యర్థి నీలం మధు, పటాన్ చెరు నియోజకవర్గ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఇన్ చార్జీ మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో వారిద్దరు ఐక్యత చాటారు. కొందరు కావాలని గ్రూపులు సృష్టిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని వారు ఆరోపించారు. పటాన్ చెరు కాంగ్రెస్ లో వర్గపోరు ఉందన్న ప్రచారంపై తాను విచారణ జరిపించగా అది వాస్తవం కాదని తేలిందని మంత్రి వివేక్​ అన్నారు. పటాన్ చెరు నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. 

నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం తూప్రాన్​లో మల్లన్న సాగర్ రైట్ కెనాల్ ద్వారా మండలంలోని 3 గ్రామాలకు  నీటిని అందించాలని మంత్రి వివేక్ వెంకటస్వామికి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి వినతిపత్రం అందించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో ఉందని త్వరలోనే నిర్మాణం చేపట్టి  పంటలకు నీరందిస్తామని చెప్పారు.