
60స్థానాల్లో పోటీ చేస్తున్నం
బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి ఆగిపోతది
MIMతో పొత్తు ఉంటుంది…
MIMకు డిప్యూటీ మేయర్ ఇస్తామా లేదా అనేది తెలువదు: మంత్రి గంగుల
మున్సిపల్ ఎన్నికలకు రెడీగా ఉన్నామని అన్నారు బీసీ సంక్షేమశాఖ మంత్రి, టీఆర్ఎస్ నాయకులు గంగుల కమలాకర్. ఈ రోజు కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన… మున్సిపల్ ఎన్నికల్లో వేరే పార్టీ వాళ్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా తాము మాత్రమే గెలుస్తమని చెప్పారు. అభివృద్ధి చేసే పార్టీ టీఆర్ఎస్ అని.. ఆటంకాలు చేసే పార్టీ బీజేపీ అని ఆయన అన్నారు. ఈసారి ఒక్క బీజేపీ కార్పొరేటర్ ను గెలిపించినా… స్థానికంగా జరుగుతున్న పనులన్నింటినీ ఆపుతాయని కమలాకర్ అన్నారు. ఐటీ టవర్ ఓపెన్ కాకుండా ఆపుతారని చెప్పారు.
అభివృద్ధి నిరోధకులను ఓడించండని పిలుపునిచ్చారు మంత్రి కమలాకర్. స్థానిక సంస్థల్లో అభివృద్ధి కావాలంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నే గెలిపించాలని కోరారు. గ్రానైట్ విషయంలో బీజేపీ నేతలు అనవసర రాద్ధాంతం చేసి ఫేయిలయ్యారని చెప్పారు. ఆర్టీసీ డ్రైవర్ బాబు మృతిని కూడా రాజకీయం చేశారని అన్నారు.
ఐటీ టవర్ లో శాఖల ఏర్పాటుకు 18 కంపెనీలు ముందుకు వచ్చాయని చెప్పారు కమలాకర్. ఈనెల 30న జరగాల్సిన ఐటీ టవర్ ప్రారంభోత్సవం ఎన్నికల కోడ్ వల్ల వాయిదా పడిందని చెప్పారు. అయినా కంపెనీలకు కావాల్సిన సదుపాయాల కల్పన, ఇతర పనులు జరుగుతున్నాయని తెలిపారు. నగరంలో స్మార్ట్ సిటీ పనులుకూడా వేగంగా సాగుతున్నాయని అన్నారు. మున్సిపల్ కమిషనర్ పై పోలీసు కేసులు పెట్టి బీజేపీ నేతలు భయభ్రాంతులకు గురిచేసినా అభివృద్ది ఆగదని చెప్పారు. 27వ తారీఖున మున్సిపల్ ఎన్నికల శంఖారావం పూరిస్తున్నామని చెప్పారు కమలాకర్. త్రీమెన్ కమిటీ ద్వారా పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. పార్టీ వ్యతిరేకులకు టికెట్లు ఇవ్వొద్దని త్రీమెన్ కమిటీకి సూచిస్తామని చెప్పారు. ప్రజలు కోరుకునే నీతివంతమైన పాలన అందిస్తామని… ఆశీర్వదించండి టీఆర్ఎస్ కూ ఓటేయాలని కోరారు. పార్టీకి విధేయత, విజయావకాశాలు ఉన్న వారికే మున్సిపల్ టికెట్లు ఇస్తామని చెప్పారు. 60 డివిజన్లలో పోటీ చేస్తామని… ఎంఐఎం తో పొత్తు ఉంటుందని అన్నారు. వారికి డిప్యూటీ మేయర్ ఇస్తామాలేదా అనేది తెలువదని చెప్పారు మంత్రి కమలాకర్.