
- బెదిరింపులు సరికాదు: మంత్రి గంగుల
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం పచ్చగా ఉండటం చూసి ఓర్వలేక కేంద్రం ఇబ్బందులు పెడుతోందని, చిన్న చిన్న సాకులతో ఎఫ్‌సీఐ ప్రతిసారి బెదిరించడం తగదని సివిల్సప్లయ్స్ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అవసరమైన నివేదికలన్నీ ఇస్తామని, ఎఫ్‌సీఐ దాడులు ఆపాలన్నారు. ఈ మేరకు కేంద్రానికి, ఎఫ్‌సీఐకి లెటర్ రాస్తామని వెల్లడించారు. బుధవారం మంత్రి కార్యాలయంలో గంగుల మీడియాతో మాట్లాడారు. చిన్న చిన్న కారణాలతో ధాన్యం కొనుగోలు చేయబోమంటూ ఎఫ్‌సీఐ లెటర్ రాయడాన్ని తప్పుబట్టారు. కేంద్రం 90.46 లక్షల కార్డుల్లో 53 లక్షల కార్డులకే ఉచిత బియ్యం ఇస్తోందన్నారు. మెదటి విడత ఉచిత రేషన్ 8 నెలలకు రూ.980 కోట్లు, రెండో విడుత11 నెలలకు రూ.1,134 కోట్ల భారం రాష్ట్రంపై పడిందన్నారు. 2022 మార్చిలో కేంద్రం లెటర్ రాసి ఏప్రిల్ నుంచి 6 నెలలు ఉచిత బియ్యం ఇవ్వాలని కోరిందన్నారు. మూడో దశ కూడా ఉచిత బియ్యం ఇవ్వాలని సీఎం నిర్ణయించినా ఒక నెల ఆలస్యమైందన్నారు. జూన్‌లో ప్రస్తుతం రెగ్యులర్ కోటాలో 6 కిలోలు, ఉచిత రేషన్ 5 కిలోలు మొత్తం11 కిలోలు ఇస్తామని చెప్పారు.
కేంద్రం పెత్తనం
సీఎంఆర్ ఇచ్చిన తర్వాతే ఎఫ్‌సీఐ పరిధిలోకి చేరుతాయని, కానీ కేంద్రం తమపై పెత్తనం చలాయిస్తోందని గంగుల ఆగ్రహం వ్యక్తం చేశారు. రెస్ మిల్లుల్లో ఉన్న ధాన్యం, బియ్యం రాష్ట్రం పరిధిలోనివేనని స్సష్టం చేశారు. డీపీసీలో, ఏవోయూలో ఉన్నామని, అధికారం ఉందని తనిఖీల పేరుతో వేదింపులకు పాల్పడటం సరికాదన్నారు. రెండో దశలో 63 మిల్లుల్లో తేడా అని జూన్ 4న లేఖ రాశారు.. దాన్ని కలెక్టర్లకు పంపి పరిశీలించమని ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రి రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయడం లేదని విమర్శించారు. ధాన్యం సేకరణకు రూ.3,500 కోట్లు భరించి రారైస్ ఇస్తున్నామని తెలిపారు.
పెట్రోల్, డీజీల్ కొరత రానియ్యం
ఆయిల్ కంపెనీలు తమ పరిధిలో లేవని, అయినా పెట్రోల్, డీజిల్‌కు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని, సాయంత్రం వరకు సమస్య కొలిక్కి వచ్చే అవకాశం ఉందని గంగుల తెలిపారు. స్టాక్ ఉండి ప్రజలకు పెట్రోల్, డీజిల్ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.