ఏడాదికి 15 లక్షల మంది చనిపోతున్నారు : మంత్రి హరీశ్

ఏడాదికి 15 లక్షల మంది చనిపోతున్నారు : మంత్రి హరీశ్

రోజురోజుకు సడెన్ గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతుందని.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజుకు 4 వేల మంది సడెన్ గుండెపోటుతో చనిపోతున్నారని తెలిపారు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. సంవత్సరానికి 15 లక్షల మంది గుండెపోటులతోనే చనిపోయారనే సంచలన విషయాలను వెల్లడించారు మంత్రి హరీశ్. మార్చి 27వ తేదీ సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో జరిగిన CPRపై శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరూ సీపీఆర్ పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

CPRపై కేవలం 2 శాతం మందికే అవగాహన ఉందని.. 98 శాతం మందికి అవగాహన లేదన్నారు మంత్రి హరీశ్ రావు. CPRపై అవగాహన లేకపోవడంతో చాలా మంది కార్డియక్ అరెస్ట్ తో చనిపోతున్నారని.. అందుకే కార్డియక్ అరెస్ట్ పై అవగాహన కలిపిస్తున్నామన్నారు మంత్రి. CPR చేయడానికి పెద్ద చదువు ఏమీ అవసరం లేదని.. అవగాహన ఉంటే చాలన్నారు. అన్ని శాఖల సిబ్బందికి CPRపై శిక్షణ ఇస్తున్నామని..సడన్ కార్డియక్ అరెస్ట్ కి, హార్ట్ ఎటాక్ కి తేడా ఉందని..అప్పటికప్పుడు కుప్పకూలితే అది కార్డియక్ అరెస్ట్.. అలా జరిగినప్పుడు చేసేదే CPR అంటారని వివరించారు మంత్రి హరీష్ రావు.

CPR కాకుండా AED పరికరంతో కరెంట్ షాక్ ఇచ్చి ట్రీట్ మెంట్ ఇస్తామని..ఇదంతా కార్డియక్ అరెస్ట్ అయిన 5 నుంచి 10 నిమిషాల్లో జరగాలని చెప్పారు మంత్రి హరీష్. రాష్ట్రంలో 1200 AED మిషన్లు కొనాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 1500 కోట్లతో 1200 AED మిషన్లు కొనుగోలు చేస్తున్నామని స్పష్టం చేశారు. మారిన ఆహారపు అలవాట్లతో ఈ కార్డియక్ అరెస్ట్ వస్తుంది. కరోనా తర్వాత కూడా వస్తుందని డాక్టర్లు చెబుతున్నారని హరీష్ రావు తెలిపారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కరు CPR పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు మంత్రి హరిష్ రావు.