
అనర్హత వేటు వేయాలి..సంజయ్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి: హరీశ్
టెన్త్ పేపర్ లీకేజీలో ఆయనే ప్రధాన సూత్రధారి
బీఆర్ఎస్ను ఎదుర్కోలేక బీజేపీ క్షుద్ర రాజకీయాలు చేస్తోందని ఫైర్
మెదక్, వెలుగు : టెన్త్ క్వశ్చన్ పేపర్ లీకేజీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయే ప్రధాన సూత్రధారి అని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. పేపర్ లీకేజీకి కుట్ర పన్ని లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న సంజయ్‌పై అనర్హత వేటు వేయాలని, ఆయన పార్లమెంట్సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంజయ్ పై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. బుధవారం మెదక్‌లో మీడియాతో హరీశ్ రావు మాట్లాడారు. బీఆర్ఎస్ ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక బీజేపీ క్షుద్ర రాజకీయం చేస్తోందని ఆయన ఫైర్ అయ్యారు.
‘‘వరంగల్‌లో సంజయ్ పన్నిన క్వశ్చన్ పేపర్ లీకేజీ కుట్ర బయటపడింది. ఆయన రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినా బుకాయిస్తున్నారు. మంగళవారం ఉదయం లీకేజీకి పాల్పడ్డోళ్లను అరెస్ట్ చేయాలని వరంగల్‌లో బీజేపీ నాయకులు ధర్నా చేశారు. మళ్లీ వాళ్లే అరెస్ట్చేసినోళ్లను విడుదల చేయాలని సాయంత్రం ధర్నా చేశారు. దీన్ని బట్టి లీకేజీలో బీజేపీ కుట్ర ఉందన్నది తేలిపోయింది. మొన్న తాండూరులో టెన్త్ తెలుగు పేపర్ లీకేజీకి పాల్పడ్డ టీచర్ బీజేపీ అనుబంధ ఉపాధ్యాయ సంఘంలో ఉన్నారు. నిన్న వరంగల్‌లో పేపర్‌లీకేజీ కేసులో అరెస్టయిన ప్రశాంత్ బీజేపీ కార్యకర్త. ప్రశాంత్ కు బీజేపీ రాష్ట్ర, జాతీయ అగ్రనేతలతో సంబంధాలు ఉన్నాయి” అని అన్నారు.
సంజయ్.. సమాచారం ఎందుకు దాచినవ్?
‘‘టెన్త్ పేపర్ వాట్సాప్ లో వైరల్ చేసిన ప్రశాంత్ బీజేపీ కార్యకర్త కాదా? ప్రశాంత్ క్వశ్చన్పేపర్నీకు వాట్సాప్ లో పంపింది నిజం కాదా? రెండు గంటల్లో 142 సార్లు నిందితుడు ఫోన్లో మాట్లాడింది నిజం కాదా? పనిగట్టుకొని క్వశ్చన్పేపర్ ను మీడియా గ్రూపులకు, వెబ్ సైట్లకు మీ ప్రోద్భలంతో పంపింది నిజం కాదా? క్వశ్చన్పేపర్ వైరల్ కావడంలో నీ ప్రమేయం లేకుంటే.. నీకు నిందితుడు ఇచ్చిన సమాచారాన్ని ఎందుకు దాచావ్?” అని సంజయ్ ను హరీశ్ రావు ప్రశ్నించారు. బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని ఫైర్ అయ్యారు. బీజేపీకి చదువు విలువ తెలియదని, ఆ పార్టీలో రాష్ట్రం నుంచి ఢిల్లీ దాకా ఫేక్‌సర్టిఫికెట్ ఉన్నోళ్లే ఉన్నారని విమర్శించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
‘‘సంజయ్ ను బీజేపీ చీఫ్ నడ్డా సమర్థించడం సిగ్గుచేటు. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్లో 16 సార్లు క్వశ్చన్ పేపర్లు లీకైతే ఆ పార్టీ పెద్దలు ఎందుకు మాట్లాడలేదు. క్వశ్చన్‌పేపర్లు వాట్సాప్ లో పంపితే తప్పేంటని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అంటున్నారు. పరీక్ష పూర్తయిన తర్వాత పంపితే తప్పు లేదు గానీ, పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే పేపర్వాట్సాప్లో పంపారు. ప్రశాంత్ వాట్సాప్‌లో అంతా బయటపడింది” అని అన్నారు. ఈ కేసులో నిందితులెవరైనా కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.