
- ఇంటెన్షన్‌తో మాట్లాడెటోళ్లను దేవుడే చూసుకుంటడు
- కండ్లు ఉండి చూడలేకపోతున్నరు.. చెవులు ఉండి వినలేకపోతున్నరు
- ఉస్మానియా దవాఖాన పాత బిల్డింగ్ కూల్చి.. కొత్తది కడ్తమని ప్రకటన
హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగ పదవుల్లో ఉన్న కొంత మంది హాఫ్ నాలెడ్జ్‌తో మాట్లాడుతున్నారని గవర్నర్ తమిళిసైని ఉద్దేశించి మంత్రి హరీశ్‌రావు పరోక్షంగా విమర్శలు చేశారు. దవాఖాన్లలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా, ఉద్దేశపూర్వకంగా కామెంట్ చేసేవారి సంగతి దేవుడే చూసుకుంటాడని అన్నారు. సోమవారం నిమ్స్‌లో రోబోటిక్ సర్జరీలకు అవసరమయ్యే ఎక్విప్‌మెంట్‌ను ప్రారంభించిన అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. నిమ్స్‌లో రూ.35 కోట్లతో రోబోటిక్ సర్జరీ ఎక్విప్‌మెంట్‌ను తీసుకొచ్చామని చెప్పారు. బెడ్ల సంఖ్య తెలంగాణ రాకముందు 900 ఉంటే, ఇప్పుడు 1800కు పెంచామన్నారు. నిమ్స్‌లో కల్పిస్తున్న సౌకర్యాలతో నీట్ పీజీ ఆల్ ఇండియా ర్యాంకర్లు నిమ్స్‌లో చదివేందుకు వస్తున్నారని ఆయన తెలిపారు. అయితే, కొంత మంది ఇవేవీ తెలుసుకోకుండా కామెంట్స్ చేస్తున్నారని విమర్శించారు. ‘‘ ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందన్నట్టు రాజ్యాంగ పదువుల్లో ఉన్న కొంత మంది మాట్లాడుతున్నరు. విషయం తెలుసుకోకుండా, హాఫ్ నాలెడ్జ్‌తో కామెంట్లు చేస్తున్నరు. నేను ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్న. నిమ్స్ ఎలా పనిచేస్తుందో, ఆల్ ఇండియా ర్యాంకర్లు ఇక్కడికి ఎందుకు వస్తున్నరో వాళ్లు తెలుసుకోవాలి. అయినా, ఇంటెన్షన్‌గా మాట్లాడే వాళ్ల గురించి దేవుడే చూసుకుంటడు” అని పరోక్షంగా గవర్నర్‌ను హరీశ్ విమర్శించారు. ‘‘చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు అన్న విధంగా, కొంత మంది మంచి చూడొద్దు, మంచి వినొద్దు, మంచి మాట్లాడొద్దు అని నిర్ణయించుకున్నరు. కండ్లు ఉండి చూడలేక, చెవులు ఉండి వినలేక పోతున్న ఇలాంటి వారి గురించి ఏమీ ఆలోచించలేం” అని ఆయన దుయ్యబట్టారు. ‘‘ఎంత అభివృద్ధి చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా వారికి కనిపించడం లేదు. ఒక్కసారి కూడా ప్రశంసించక పోగా, అబాండాలు వేస్తుండటం దురదృష్టకరం. అలాంటి వారిని ఏమనాలి?” అంటూ హరీశ్‌రావు ప్రశ్నించారు.
పాతది కూల్చి.. కొత్తది కడ్తం
ప్రజల శ్రేయస్సు కోసం ఉస్మానియా దవాఖాన పాత భవనాలు తొలగించి, కొత్త బిల్డింగ్ నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ఈ విషయంపై మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహ మూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్, దానం నాగేందర్, సిటీకి చెందిన ఇతర ప్రజాప్రతినిధులు, హెల్త్ ఆఫీసర్లతో సెక్రటేరియెట్‌లో సోమవారం మంత్రి సమావేశం నిర్వహించారు. ప్రజల అవసరాల దృష్ట్యా పాత బిల్డింగ్ కూల్చి, కొత్త బిల్డింగ్ కట్టడంపై ఈ సమావేశంలో మంత్రి ప్రస్తావించారు. పాత భవ నాలు కూల్చి కొత్త భవనం నిర్మించే అంశంపై సమావేశంలో పాల్గొన్న నేతలందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారని సమావేశం అనంతరం విడుదల చేసిన ప్రకటనలో మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇదే విషయాన్ని హైకోర్టుకు ఇచ్చే అఫిడవిట్‌లో పేర్కొంటామని వెల్లడించారు.ఉస్మానియా దవాఖానకు కొత్త బిల్డింగ్ కట్టాలని 2015లోనే సీఎం కేసీఆర్ నిర్ణయించినప్పటికీ, పాత బిల్డింగ్ కూల్చివేతపై హైకోర్టు స్టే ఇవ్వడంతో ఆ పని ఆగిపోయిందన్నారు. అఫిడవిట్ దాఖలు తర్వాత కోర్టు తీర్పును అనుసరించి బిల్డింగ్ నిర్మా ణం ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు.
ఆగిన డాక్టర్ల ర్యాలీ
ఉస్మానియాకు కొత్త బిల్డింగ్ కట్టాలన్న డిమాండ్‌తో సోమవారం ర్యాలీ చేయాలని డాక్టర్లు నిర్ణయించారు. ర్యాలీకి పర్మిషన్ ఇవ్వాలని కోరినప్పటికీ పోలీసులు స్పందించకపోవడంతో ర్యాలీ ఆగిపోయింది. ఇదే సమయంలో కొత్త బిల్డింగ్‌పై చర్చించేందుకు సెక్రటేరియెట్‌కు రావాలని డాక్టర్లను మంత్రి హరీశ్‌రావు ఆహ్వానించారు. ప్రజాప్రతినిధులతో సమావేశానికి ముందే డాక్టర్లతో ఆయన భేటీ అయ్యారు. ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయకపోవడం వల్లే కేసు పెండింగ్‌లో పడిందని, ఇప్పటికైనా ప్రభుత్వ అభిప్రాయం ఏంటో స్పష్టంగా తెలుపుతూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని మంత్రిని డాక్టర్లు కోరారు. ఇందుకు మంత్రి సుముఖత వ్యక్తం చేశారని, కోర్టు తీర్పు వచ్చిన మరుసటి నాడే కొత్త బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన జీవోను విడుదల చేస్తామని హామీ కూడా ఇచ్చారని డాక్టర్లు చెప్పారు. మంత్రి హామీ నేపథ్యంలో తమ నిరసనలను వారం రోజుల పాటు వాయిదా వేసుకుంటున్నట్టు ఉస్మానియా జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది.