బస్తీ దవాఖాన్ల పనులు త్వరగా పూర్తి చేయాలి

బస్తీ దవాఖాన్ల పనులు త్వరగా పూర్తి చేయాలి

హైదరాబాద్, వెలుగు: బస్తీ దవాఖాన్ల ఏర్పాటు పనులను ఆగస్ట్‌‌‌‌ 15వ తేదీలోగా పూర్తి చేయాలని హెల్త్ ఆఫీసర్లను మంత్రి హరీశ్‌‌‌‌రావు ఆదేశించారు. పనులు పూర్తయిన 12 దవాఖాన్లను, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో వీలైనంత త్వరగా ప్రారంభించాలని సూచించారు. ఈ మేరకు హెల్త్ ఆఫీసర్లతో బుధవారం మంత్రి రివ్యూ చేశారు. జీహెచ్‌‌‌‌ఎంసీ పరిధిలో ఇప్పటికే 259 బస్తీ దవాఖాన్లు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ బస్తీ దవాఖాన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 131 బస్తీ దవాఖాన్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయన్నారు. వీటిని ఆగస్టు చివరికల్లా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. బస్తీ దవాఖాన్లకు వచ్చే పేషెంట్లకు, తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్లలో ఉచితంగా టెస్టులు కూడా చేయిస్తున్నామని మంత్రి గుర్తు చేశారు. ఇయ్యాల శాంపిల్ ఇస్తే, తెల్లారికల్లా రిపోర్ట్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఎంసీఆర్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌డీలో జరిగిన ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, కమిషనర్‌‌‌‌‌‌‌‌ శ్వేత మహంతి, డీహెచ్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌‌‌‌రెడ్డి, సీఎం ఓఎస్డీ, డాక్టర్ గంగాధర్‌‌‌‌‌‌‌‌, టీఎస్‌‌‌‌ఎంఎస్‌‌‌‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  బ్రిటీష్ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్, ఇంటర్నేషనల్ హస్పిటల్స్ గ్రూప్ సీఈవో చేస్టర్ కింగ్, సీవోవో సైమన్ ఆశ్వర్త్, ఆ సంస్థల భారత ప్రతినిధి పృథ్వి సహాని సమావేశానికి ముందు మంత్రిని కలిశారు. తెలంగాణ ప్రభుత్వ వైద్య వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వారు అభినందించినట్టు మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. హాస్పిటళ్ల నిర్మాణం, ఇతర విషయాల్లో సాంకేతిక సహకారం అందించేందుకు వారు 
ముందుకొచ్చారని పేర్కొంది.

జిల్లాల్లో కీమో థెరపీలు

కీమో, రేడియో థెరపీలను జిల్లా ఆసుపత్రుల్లోనూ ప్రారంభించాలని యోచిస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. హైదరాబాద్ లో బుధవారం నిర్వహించిన  బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి 22 వ ఫౌండేషన్ డే కార్యక్రమానికి ఆయన, నటుడు బాలక్రిష్ణతో పాటు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం  క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తోందని మంత్రి చెప్పారు. ప్రస్తుతం 300 ప‌‌డ‌‌క‌‌లున్న ఎంఎన్‌‌జే ఆస్పత్రిని 750 ప‌‌డ‌‌క‌‌ల‌‌కు అప్‌‌గ్రేడ్ చేస్తున్నామ‌‌ని తెలిపారు. అటానమస్ సంస్థగా రూపొందించి మరింత మెరుగ్గా చేస్తున్నామని అన్నారు.