కాంగ్రెస్, బీజేపీవి తిట్లు.. కేసీఆర్​వి కిట్లు: హరీశ్ రావు

కాంగ్రెస్, బీజేపీవి తిట్లు.. కేసీఆర్​వి కిట్లు: హరీశ్ రావు
  •    ఆ పార్టీలు దొంగ డిక్లరేషన్లతో వస్తున్నయి: హరీశ్ రావు
  •     కొల్లూర్ లో డబుల్ బెడ్​రూమ్​లు పంపిణీ చేసిన మంత్రి

రామచంద్రాపురం, వెలుగు: ప్రజలకు కేసీఆర్ కిట్లు ఇస్తుంటే.. కాంగ్రెస్, బీజేపీ తిట్లు ఇస్తున్నాయని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ప్రజలే కేసీఆర్​ను మూడోసారి సీఎంగా చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్​లో గురువారం రెండో విడత డబుల్ బెడ్​రూంలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 60 ఏండ్లలో కాంగ్రెస్, టీడీపీలు చేయలేని అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. ఎలక్షన్ టైం కాబట్టి దొంగ డిక్లరేషన్లతో కాంగ్రెస్, బీజేపీలు వస్తున్నాయని విమర్శించారు. 

చెన్నై నుంచి వచ్చిన రజనీకాంత్​కు  తెలంగాణ అభివృద్ధి అర్థమైంది కానీ ఇక్కడున్న గజినీలకు మాత్రం అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. కృష్ణ జలాల అంశంపై సుప్రీంకోర్టులో వేసిన కేసు ఏపీ ప్రభుత్వం ఓడిపోయిందని మనకు రావాల్సిన 90 టీఎంసీల కృష్ణ జలాలతో తెలంగాణను తడుపుతామని అన్నారు. 

గేటెడ్ కమ్యూనిటీ తరహాలో వసతులు 

లక్ష డబుల్ బెడ్​రూమ్​ఇండ్లను అందించిన ప్రభుత్వం దేశంలో తెలంగాణ ఒక్కటేనని పేర్కొన్నారు. కొల్లూర్​లో డబుల్ బెడ్​రూంలు ఏసియాలోనే పెద్దవని హరీశ్ అన్నారు. ఇక్కడికి వచ్చే లక్ష జనాభాకు గేటెడ్ కమ్యూనిటీకి తీసిపోకుండా సౌలత్​లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. గురువారం 4,800 మంది లబ్ధిఆరులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. కంప్యూటర్​ ద్వారా లాటరీ తీసి వీటిని కేటాయించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గాంధీ, దానం నాగేందర్, గోపీనాథ్ పాల్గొన్నారు.