డబుల్ బెడ్ రూం ఇళ్లు ప్రారంభించిన హరీష్ రావు

డబుల్ బెడ్ రూం ఇళ్లు ప్రారంభించిన హరీష్ రావు

దేశంలో ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రామయపల్లి గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఆయన ప్రారంభించారు. లబ్దిదారులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. పైసా ఖర్చు లేకుండా ఇల్లు కట్టించిన ఘనత టీఆర్ఎస్ సర్కారుదేనని హరీష్ రావు చెప్పారు. జాగా ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి ప్రభుత్వమే డబ్బు ఇచ్చే కార్యక్రమం త్వరలోనే ప్రారంభిస్తామని ప్రకటించారు. 

కేసీఆర్ సర్కారు అమలు చేస్తున్న పింఛన్లు, కేసీఆర్ కిట్, అమ్మ ఒడి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు. సర్కారు నౌకరీకి ఉన్నంత క్రేజ్ ఇప్పుడు ప్రభుత్వ దవాఖానా, స్కూళ్లకు రాబోతోందని చెప్పారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక తాగు, సాగు నీటితో పాటు కరెంటుకు కొరత లేకుండా పోయిందని అన్నారు. 70ఏళ్లలో ఏం చేయలేని కాంగ్రెస్, బీజేపీ ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని  విమర్శిస్తున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. నిన్న హైదరాబాద్ వచ్చిన మోడీ రాష్ట్రం గురించి ఒక్క మాటైనా మాట్లాడకపోవడాన్ని తప్పుబట్టారు. తెలంగాణ అభివృద్ధిని చూసి కేంద్రం ఓర్వలేకపోతోందని, మతాల మధ్య చిచ్చుపెట్టి లాభపడాలని చూస్తోందని ఆరోపించారు. శక్తి ఉన్నంత వరకు టీఆర్ఎస్ ప్రజా సేవ చేస్తుందని, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతుందని హరీష్ రావు హామీ ఇచ్చారు.