నెక్లెస్ రోడ్డులో నర్సరీ మేళా ప్రారంభం

నెక్లెస్ రోడ్డులో నర్సరీ మేళా ప్రారంభం

హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో 12వ గ్రాండ్ నర్సరీ మేళాను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మొక్కలు కొనడం తనకు హాబీ అన్నారు. గ్రీనరి చూస్తే అందరికి సంతోషంగా ఉంటుందని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఉండే అన్ని మొక్కలు ఈ మేళా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వారి వారి ఇష్టాలను బట్టి మొక్కలు నర్సరీలో కొనుగోలు చేయొచ్చన్నారు. కిచెన్ గార్డెన్, టెర్రస్ గార్డెన్, వర్టికల్ గార్డెన్ వంటి ఎన్నో రకాల మొక్కలు నర్సరీలో అందుబాటులో పెట్టామని తెలిపారు.  

రాష్ట్రం వచ్చాక 7.6 గ్రీన్ కవర్ పెరిగింది..
ప్రతి పల్లెలో నర్సరీ ఏర్పాటు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదని మంత్రి హరీష్ రావు అన్నారు. నర్సరీల ద్వారా గ్రామ ప్రజలకు ఉచితంగా మొక్కలు ఇస్తున్నట్లు చెప్పారు. ప్రతి పల్లెలో ట్రాక్టర్, స్థలం, నర్సరీలను పెంచడానికి మనిషి.. ఇలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. గ్రామాలు,  పట్టణాల్లో నర్సరీలు పెట్టామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 240 కోట్ల మొక్కలు నాటినట్లు తెలిపారు. దీని ద్వారా రాష్ట్రంలో 31.6 శాతం గ్రీన్ కవర్ వచ్చిందన్నారు. ఈ ఏడాది 20 కోట్ల మొక్కలు నాటనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రం వచ్చాక 7.6 శాతం గ్రీన్ కవర్ పెరిగిందని..కేంద్ర లెక్కలె చెబుతున్నాయన్నారు. ప్రతీ ఒక్కరు తమ పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. ప్రతీ పౌరుడు బాధ్యత తీసుకుని..పిల్లల భవిష్యత్ కోసం మొక్కలు నాటాలన్నారు. 

ఐదు రోజుల పాటు నర్సరీ..
గ్రాండ్ నర్సరీ మేళా-2022 ఐదు రోజుల పాటు జరగనుంది. ఈ మేళాలో పలు కంపెనీలు, అంకుర కేంద్రాలు, నర్సరీలు150 స్టాళ్లను ఏర్పాటు చేశాయి. ఈ స్టాళ్లలో అరుదైన మొక్కలు, విత్తనాలు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంచారు. హర్యానా, ఢిల్లీ, బెంగళూరు, పుణె, కోల్​కతా, కడియం, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి పలు సంస్థలు.. తమ ఉత్పత్తులను మేళాలో ప్రదర్శించి విక్రయించనున్నాయి.  గ్రాండ్ నర్సరీ మేళా ఎంట్రీ ఫీజు రూ.30 నిర్ణయించారు.