ఎన్నికలు దగ్గరికి రాగానే టెంట్లు వేసి.. స్టంట్లు చేస్తున్నరు: మంత్రి హరీష్ రావు

 ఎన్నికలు దగ్గరికి రాగానే టెంట్లు వేసి.. స్టంట్లు చేస్తున్నరు: మంత్రి హరీష్ రావు

ఎన్నికలు దగ్గరికి రాగానే కాంగ్రెస్ పార్టీ టెంట్లు వేసి స్టంట్ లు చేస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ కు బరువు బాధ్యత లేదని మండిపడ్డారు. తెలంగాణ కోసం కేంద్రంలో కొట్లాడం కాంగ్రెస్ చేతకాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లు అధికారంలో ఉండి కూడా తెలంగాణకు చేసింది ఏం లేదని విమర్శించారు. 
   
2009 సంవత్సరంలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్కటి అమలు చేయలేదని తెలిపారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిని చేద్దామని సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకుంటున్నారని తెలిపారు.   కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎన్ని ఎత్తులు వేసిన..కేసీఆర్ మూడోసారి సీఎంగా హైట్రిక్ కొట్టడం ఖాయమని మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. 

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో రూ. 19 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ ను ప్రారంభించామని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఒకప్పుడు హుస్నాబాద్ లో అన్ని గుంతల రోడ్లు ఉండేవని.. ఇప్పుడు అన్ని సీసీ రోడ్లే అయ్యాయని అన్నారు. దాదాపుగా హుస్నాబాద్ నియోజకవర్గాన్ని రూ. 7752 కోట్లతో అభివృద్ధి చేశామని చెప్పారు. రూ. 2,500 కోట్లతో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేశామని స్పష్టం చేశారు.