రైతులు, నిరుద్యోగ యువతను బీజేపీ దగా చేస్తుంది

రైతులు, నిరుద్యోగ యువతను బీజేపీ దగా చేస్తుంది

పేదలకు వైద్యం అందించడంలో తెలంగాణ మూడో స్థానంలో ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. పెద్దపల్లి జిల్లామంథనిలో 50 పడకల మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. మంథని హాస్పిటల్ ను డెవలప్ చేసి ఐసీయూ ఏర్పాటు చేస్తామన్నారు.లద్నాపూర్ భూ నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ సమస్యలను సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి పరిష్కరిస్తామని చెప్పారు. రామగుండం ప్రజల దశాబ్దాల కల అయిన మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తైందని..ఈ ఏడాదే క్లాసులు ప్రారంభమవుతాయని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ప్రభుత్వాస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయన్నారు.  దేశానికి అన్నం పెట్టే రైతులను, నిరుద్యోగ యువతను బీజేపీ మోసం చేస్తుందన్నారు. 

బీజేపీ పార్టీ అంటేనే మతకలహాలు, రెచ్చగొట్టడం అని విమర్శించారు. 16 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్న నోటిఫికేషన్ విడుదల చేయని కేంద్రం.. పుండు మీద కారం చల్లినట్టు  అగ్నిపథ్ నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. దేశ సేవ చేయాలనుకునే యువతను అగ్నిపథ్ పేరుతో అరిగోస పెడుతున్నారని..యువకుల ఆశలు, కలల మీద నీళ్లు చల్లుతున్నారని మండిపడ్డారు. దేశం కోసం పోరాడితే యావజ్జీవ శిక్ష వెస్తామనడం  దారుణమన్నారు. గత పాలకుల హయాంలో రాష్ట్రంలో కేవలం 3 డయాలసిస్ సెంటర్లు మాత్రమే ఉండేవని..కానీ100 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు  చేసినట్లు మంత్రి వెల్లడించారు. గతంలో 3 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే నేడు 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు కొనసాగుతుందన్నారు. 50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్, 20 ఏళ్ల పాలనలో టీడీపీ చేసింది ఏంటో చెప్పాలన్నారు.