
- బ్యాంకర్లకు మంత్రి హరీశ్ రావు ఆదేశాలు
- కట్ చేసిన డబ్బును రైతుల అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేయండి
- రైతుల ఫిర్యాదుల స్వీకరణకు రెండు టోల్ ఫ్రీ నంబర్లు
హైదరాబాద్, వెలుగు: రైతుబంధు డబ్బులను ఆపొద్దని బ్యాంకర్లను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. నిలిపివేసిన లేదా సర్దుబాటు చేసిన మొత్తాన్ని తిరిగి రైతుల ఖాతాకు జమ చేయాలని సూచించారు. ఈ అంశంపై బ్యాంకర్లు తమ బ్యాంకు బ్రాంచీలకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రైతుబంధు సొమ్మును రైతులు విత్ డ్రా చేయడానికి కొన్ని బ్యాంకులు అంగీకరించడం లేదని, పాత బకాయిల కింద ఆ మొత్తాన్ని సర్దుబాటు చేస్తున్నాయని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో బ్యాంకర్లతో మీటింగ్ పెట్టాలని మంత్రి హరీశ్ రావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందులో భాగంగా మంగళవారం సెక్రటేరియట్లో బ్యాంకర్లతో హరీశ్‌రావు, సీఎస్ సోమేశ్ కుమార్ సమావేశమయ్యారు. రైతుబంధు నిధులను నిలిపివేయాలని తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని ఈ సందర్భంగా బ్యాంకర్లు హరీశ్ రావుకు తెలిపారు.
సమస్యల పరిష్కారానికి టీం ఏర్పాటు
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర స్థాయిలో ఉన్నత స్థాయి టీం మానిటర్ చేస్తుందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. జిల్లా స్థాయిలో పర్యవేక్షించాలని కలెక్టర్లను ఆదేశించారు. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు టోల్ ఫ్రీ నెంబర్లను(18002001001, 040 33671300) ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇవి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయని అధికారులు తెలిపారు. పంట రుణాల రెన్యువల్, పంపిణీని బ్యాంకర్లు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఎస్‌బీఐ డీజీఎం నటరాజన్, బ్యాంక్ ఆఫ్ బరోడా జీఎం మన్ మోహన్ గుప్తా, ఎస్‌ఎల్‌బీసీ డీజీఎం శేష్ కుమార్ ఆదిరాజుతోపాటు ఇతర బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.