మా మేనిఫెస్టో చూస్తే ప్రతిపక్షాలకు దిమ్మ తిరుగుతది: హరీష్రావు

మా మేనిఫెస్టో చూస్తే ప్రతిపక్షాలకు  దిమ్మ తిరుగుతది: హరీష్రావు
  • ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా మేనిఫెస్టో: మంత్రి హరీశ్ రావు

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో చూసి ప్రతిపక్షాలకు దిమ్మ తిరగబోతోందని మంత్రి హరీశ్‌‌రావు అన్నారు. కేసీఆర్ మాట ఇచ్చారంటే నెరవేర్చుతారనే నమ్మకం ప్రజల్లో ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని కొనసాగిస్తూనే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా తమ మేనిఫెస్టో ఉంటుందని చెప్పారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం.. కేసీఆర్ నేతృత్వంలో సెంచరీ కొట్టడం పక్కా అని తెలిపారు. కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. 

మూడోసారి బీఆర్ఎస్ గెలిపించండి.. అభివృద్ధిని కొనసాగిద్దామని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్‌‌కు ఏ పార్టీ పోటీ కాదన్నారు. కాంగ్రెస్‌‌కు ఓటేస్తే కుక్కలు చింపిన విస్తరి అవుతుందని, బీజేపీకి ఒక్కచోట కూడా డిపాజిట్ రాదన్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిందని, పొలిటికల్ టూరిస్టులు వచ్చి ఉత్తుత్తి హామీలిస్తారని, వారిని నమ్మొద్దని సూచించారు. అధికారంలో ఉన్నప్పుడు రూ.200 పింఛన్ ఇవ్వని కాంగ్రెస్.. ఇప్పుడు ఆరు గ్యారంటీల పేరుతో కొత్త డ్రామా ఆడుతోందని మండిపడ్డారు. 

కర్నాటకలో విచ్చలవిడి అవినీతితో బీజేపీ అధికారం కోల్పోయిందని, కాంగ్రెస్‌‌ను నమ్మి ప్రజలు ఓటేస్తే.. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయలేక అక్కడి ప్రభుత్వం వంద రోజుల్లోనే బొక్కాబోర్లా పడిందని విమర్శించారు. ప్రతిపక్షాల గాలి మాటలు, మోసపూరిత హామీలను ప్రజలు నమ్మరని చెప్పారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌ కార్యకర్తలు ప్రజలకు వాస్తవాలు చెప్పి చైతన్యవంతం చేయాలని మంత్రి సూచించారు.