తలసరి ఆదాయంలో తెలంగాణది అగ్రస్థానం

తలసరి ఆదాయంలో తెలంగాణది అగ్రస్థానం

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని, 11.5 వృద్ధి రేటుతో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఉందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తలసరి ఆదాయం లక్ష 24 వేలు ఉంటే ఇప్పుడు 2 లక్షల 78 వేలతో అగ్రస్థానంలో కొనసాగుతోందన్నారు. సంగారెడ్డిలో శనివారం స్వాతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకల్లో మంత్రి హరీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. స్వాతంత్ర సమరయోధుల వేషధారణలో చిన్నారులు సాంస్కృతిక కళా ప్రదర్శన నిర్వహించారు. 

తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, సంసాద్ ఆదర్శ్ గ్రామీణ యోజనలో రాష్ట్రం నెంబర్ వన్ గా ఉందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. గాంధీజీ ఆదర్శాలను పల్లెప్రగతి కార్యక్రమంలో ముందుకు తీసువెళుతున్నట్లు తెలిపారు. బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులతో సంగారెడ్డి దశ దిశ మారనుందని, జిల్లాకు కొత్తగా 42 వేల కొత్త ఫించన్లు రానున్నట్లు తెలిపారు. విచ్చిన్నకర శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆగస్టు 15 రోజున ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగురవేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్వాతంత్ర్య సమరయోధులను సత్కరించారు.