మాట తప్పింది.. మాట మార్చింది కేంద్రమే

మాట తప్పింది.. మాట మార్చింది కేంద్రమే

కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలు రాష్ట్ర రైతాంగాన్ని అవమానపరిచేవిధంగా ఉన్నాయని ఆర్థిక శాఖ, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆయన ఒక కేంద్రమంత్రిగా కాకుండా.. రాజకీయచేస్తూ మాట్లాడటం తీవ్ర అభ్యంతరకరమని ఆయన మండిపడ్డారు. తెలంగాణ మెడికల్ సర్వీసెస్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎర్రోళ్ల శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

‘మా రాష్ట్ర మంత్రులందరూ 70 లక్షల మంది రైతుల తరపున ఢిల్లీకి వచ్చారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ప్రతినిధులుగా ఢిల్లీకి వచ్చారు. అలాంటి మంత్రులను పట్టుకొని మీకేం పనిలేదా అని మాట్లాడటం చాలా అభ్యంతరకరం. ఇది రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే. పీయూష్ గోయల్ తక్షణమే తన వ్యాఖ్యలు ఉపసంహరించుకొని.. బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. ఇప్పటికే బాయిల్డ్ రైస్ కొనమని చెప్పారు. ఇప్పడు రా రైస్ కూడా కొనమని చేతులెత్తేస్తే మా రైతులు ఏంకావాలి? నిన్ను కలవడానికి వచ్చిన మా మంత్రుల  బృందాన్ని ఎందుకొచ్చారు అని ప్రశ్నిస్తావా? నీకు ఆ హక్కు ఎక్కడిది? రాజకీయం చేస్తుంది నువ్వు. మాపై బురద చల్లుతున్నావ్. మా మంత్రులను కలవడానికి టైం లేదు కానీ మీ పార్టీ నాయకులను కలవడానికి మాత్రం టైం ఉందా? మీ పార్టీ నాయకులను ముందు కలుస్తావా లేక ప్రజల తరపున వచ్చిన మా మంత్రుల బృందాన్ని కలుస్తావా? ఆరుగురు మంత్రులు నిన్ను కలవడానికి వచ్చారు. మా ప్రాధాన్యం రైతులు.. నీ ప్రాధాన్యం రాజకీయం. ఇంత దుర్మార్గంగా మాట్లాడతావా? బేషరతుగా క్షమాపణ చెప్పాలి. మా పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రయోజనాల కోసం. త్యాగాల మీద తెలంగాణ సాధించాం. మా రాష్ట్రం, మా రైతులే మాకు ముఖ్యం. మాట తప్పింది, మాట మార్చింది, రాజకీయం చేస్తుంది మీరు. ధాన్యం అమ్ముడుపోక.. రైతులు చలిలో పడిగాపులు కాస్తున్నారు. ఆ విషయం మాట్లాడటానికి మా మంత్రులు ఢిల్లీకి వచ్చి మూడు రోజులైంది. అయినా మా వాళ్లను కలవలేదు కానీ మీ పార్టీ వాళ్లను మాత్రం కలిశావు. మీరు చేస్తున్న రాజకీయాన్ని తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. రైతుల ఓట్లు కావాలి కానీ రైతుల భాద పట్టించుకోరు. పంజాబ్ లో ఒడ్లు కొన్నట్లే .. ఇక్కడ కూడా కొనమని అడుగుతున్నాం. అక్కడ కొన్నారు.. ఇక్కడ ఎందుకు కొనరు? యాసంగిలో ఒడ్లు కొంటారా? కొనరా?? దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. రైతులకు పెట్టుబడి కింద 14 వేల 5 వందల కోట్లు రైతుబంధు ఇస్తున్నాం. రాష్ట్రం పరిధిలో రైతులకు అన్ని కల్పిస్తున్నాం. పంటల సేకరణ మీ పరిధిలోకి వస్తుంది. కరువు వచ్చినప్పడు రాష్ట్రాల దగ్గర ఉన్న ధాన్యం బలవంతంగా తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు కూడా తీసుకోండి. రాష్ట్రాల మీద బురద చల్లితే ఊరుకోం. మీకు చేత కాకపోతే మొత్తం చేతులు ఎత్తేయండి.. మేం చూసుకుంటాం. మీరు చేసింది మంత్రులను అవమానించినట్లు కాదు.. తెలంగాణ ప్రజలందరినీ అవమానించినట్లు. మా రాష్ట్రాన్ని, మా రైతులను అవమానపరిచే హక్కు మీకెక్కడిది? గోయల్ అన్నీ అబద్ధాలు మాట్లాడుతున్నారు. బియ్యం సేకరణ విషయంలో కేంద్రానికి ఇప్పటికే 10 లేఖలు రాశాం. అయినా ఒక్క లేఖైనా రాశారా అని అడుగుతున్నారు. మేం నెలకు 10 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వగలుగుతాం.  కానీ, మీరు తీసుకుంటున్నవి మాత్రం 4.69 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. పార్లమెంట్ సాక్షిగా పీయూష్ గోయల్ అబద్ధాలు చెబుతున్నారు’ అని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

For More News..

అవసరమైతే నైట్​ కర్ఫ్యూ పెట్టండి