అగ్నిపథ్​తో ఆర్మీ ఉద్యోగాలకు మంగళం

అగ్నిపథ్​తో ఆర్మీ ఉద్యోగాలకు మంగళం

నిజామాబాద్, వెలుగు: ఇక్కడి అల్లర్ల వెనుక టీఆర్ ఎస్ హస్తముంటే.. మరి యూపీ, బీహర్​లో జరిగిన అల్లర్ల వెనుక ఎవరున్నారని మంత్రి హరీశ్​ రావు ప్రశ్నించారు. బీజేపీ నేతలు బండి సంజయ్, డీకే అరుణ అవగాహన  లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఆర్మీలో జవాన్ల  ఉద్యోగాలను  ప్రైవేట్​పరం చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని, వాటిని కాంట్రాక్టు ఉద్యోగాలుగా మార్చే ప్రయత్నం  జరుగుతోందన్నారు. నిజామాబాద్​లో  రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డితో కలిసి ఆయన శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. అగ్నిపథ్​తో ఆర్మీ ఉద్యోగాలకు కేంద్రం మంగళం పాడుతోందన్నారు.  దీన్ని రద్దు చేయాలన్న యువకులను కాల్చి చంపడం అన్యాయమన్నారు. కాంగ్రెస్, బీజేపీలను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లేనన్నారు. రైతు డిక్లరేషన్ అంటూ ఒకరు, బాండ్ పేపర్ రాసిచ్చి ఇంకొకరు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, అటువంటి వాళ్లతో జాగ్రత్తగా ఉండాలన్నారు. బీజేపీ నేతల మాటలు నమ్మితే మోసపోయి గోసపడటం ఖాయమన్నారు. నల్ల చట్టాలు తెచ్చి రైతుల మెడకు ఊరి బిగించారని, అగ్నిపథ్ తో జవాన్లను రోడ్లపైకి తెచ్చారని విమర్శించారు.  జై జవాన్,  జై కిసాన్ నినాదాన్ని నై జవాన్, నై కిసాన్ గా మార్చేశారన్నారు. కాంగ్రెస్ కు గతం తప్ప  భవిష్యత్ లేదన్నారు.