బీఆర్ఎస్ పాలనలో కార్మికుల జీతాలు రెట్టింపు: మంత్రి హరీశ్‌రావు

బీఆర్ఎస్ పాలనలో కార్మికుల జీతాలు రెట్టింపు: మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే కార్మికుల వేతనాలు రెట్టింపు అయ్యాయని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కార్మికులకు జీతాలు పెంచామని చెప్పారు.  హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన కార్మిక సంఘాల సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. జీతాల కోసం కార్మికులు ధర్నాలు చేస్తే కాంగ్రెస్ ఇనుప బూట్లతో  తొక్కించిందని తెలిపారు.  సంగారెడ్డి ఆర్డినెన్సు ఫ్యాక్టరీని అమ్ముకోవడానికి  కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని హరీశ్‌ ఆరోపించారు.

మరోసారి బీఆర్‌‌ఎస్ అధికారంలోకి వస్తే ఆటో, రవాణా కార్మికులకు ట్రాన్స్‌పోర్ట్‌ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్పీలు, వీఏవోల జీతాన్ని రెండింతలు చేస్తామన్నారు. కనీస వేతన సవరణ కచ్చితంగా చేస్తామని చెప్పారు. అంగన్‌వాడీల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. కోటి కుటుంబాలకు కేసీఆర్ బీమా అందిస్తామని వివరించారు. దీనిద్వారా ఇంటి పెద్ద  ఏ కారణంతో  చనిపోయినా ఆ ఇంటి మహిళకు వారం రోజుల్లో రూ. 5 లక్షలు అందుతాయన్నారు. బీఆర్‌‌ఎస్‌ను ఓడించేందుకు ఒక్కటైన బీజేపీ, కాంగ్రెస్  పార్టీలను నమ్మొద్దని ప్రజలను మంత్రి కోరారు.