సెన్సేషన్ కోసమే కేసీఆర్ పై కామెంట్స్; హరీశ్​ రావు

సెన్సేషన్ కోసమే కేసీఆర్ పై కామెంట్స్; హరీశ్​ రావు

సిద్దిపేట/దుబ్బాక, వెలుగు : సెన్సేషన్ కోసమే కొందరు నేతలు  సీఎం కేసీఆర్​పై కామెంట్స్​ చేస్తున్నారని మంత్రి హరీశ్​ రావు మండిపడ్డారు. గురువారం సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ..  పక్క రాష్ట్రానికి చెందిన కొందరు నాయకులకు ఇక్కడ ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి చేతుల్లో ఉంటే ఎలా క్షేమంగా ఉంటుందో కేసీఆర్​ చేతుల్లో  తెలంగాణ ఉంటే అంతే క్షేమంగా ఉంటుందన్నారు.  

బీజేపీ, కాంగ్రెస్ కు ఓటు వేస్తే  పదేండ్లు  రాష్ట్రం  వెనుక్కు పోతుందన్నారు.  సిద్దిపేట ప్రజల ఆశీర్వాదంతో మంచి మెజార్టీ తో గెలుస్తాననే నమ్మకం ఉందని, ఐదేళ్లు కష్టపడి పనిచేశా మీ ఆత్మ సాక్షిగా  మార్కులు వేయాలని కోరారు. అంతకు ముందు సిద్దిపేటలోని వెంకటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు, ఈద్గా , చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసి నామినేషన్  దాఖలు చేశారు.

దుబ్బాకలో..

 చీమకు కూడా హాని చేయని నాయకుడు కొత్త ప్రభాకర రెడ్డి పై  కొంతమంది రెచ్చగొట్టి దుండగుడితో దాడి చేయించారని మంత్రి హరీశ్​రావు ఆరోపించారు. ఆయనను కడుపులో  పెట్టుకుని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థిగా కొత్త ప్రభాకర రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కొత్త ప్రభాకర్ రెడ్డి పనులు ఎక్కువ చేసి మాటలు తక్కువ మాట్లాడుతారన్నారు.  కొంత మంది మాటలు ఎక్కువ పని తక్కువ చేస్తారని ఎద్దేవా చేశారు. తెలంగాణ లో కేసీఆర్​ హ్యాట్రిక్​ కొట్టబోతున్నారని బీజేపీ చెప్పేవన్నీ ఉత్త మాటలేనని కొట్టిపడేశారు. కొత్త ప్రభాకర్​రెడ్డి  ప్రచారానికి రాకపోయిన ఆయనను గెలిపిస్తే దుబ్బాక ను రెవెన్యూ డివిజన్ చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.

మెదక్​లో..

 కేసీఆర్ సీఎంగా ఉంటేనే రాష్ట్రంలో స్టేబుల్ గవర్నమెంట్‌ ఉంటుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. మెదక్ అసెంబ్లీ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే పద్మారెడ్డి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.  కాంగ్రెస్ లో టికెట్ కావాలన్న ఢిల్లీకి వెళ్లాలి, ప్రచారం చేయాలన్న ఢిల్లీ నుంచి లీడర్లు రావాలి, ఆఖరుకు ఆసరా పెన్షన్ మంజూరు చేయాలన్న ఢిల్లీ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. తప్పిదారి కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరవుతుందన్నారు. పదేళ్లలో మెదక్ ను ఎంతో అభివృద్ధి చేసిన పద్మారెడ్డి గెలుపు ఖాయమన్నారు.

మెదక్ నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయో కనీస పరిజ్ఞానం, అవగాహన లేని వ్యక్తులు మెదక్ లో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్​ రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, నియోజకవర్గ ఎలక్షన్ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి పాల్గొన్నారు.-