పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్త: హరీశ్ రావు

పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్త: హరీశ్ రావు
  •     మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయను
  •     లేదంటే రేవంత్ సీఎం పదవికి రిజైన్ చేయాలి: హరీశ్ రావు
  •     రేపు అమరవీరుల స్తూపం వద్దకొస్త
  •     ఎనిమిది హామీలపై చర్చకు సిద్ధమా? అని సవాల్

సంగారెడ్డి, వెలుగు : ఆగస్టు 15లోపు ఏక కాలంలో రైతుల రుణాలు మాఫీ చేసి.. ఆరు గ్యారంటీలు అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని మాజీ మంత్రి హరీశ్ అన్నారు. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని తేల్చి చెప్పారు. ఒకవేళ అమలు చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తావా? అని రేవంత్​రెడ్డికి సవాల్ విసిరారు. పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ ను రద్దు చేస్తారా? అని రేవంత్ చేసిన సవాల్​కు హరీశ్ రావు స్పందించారు. సంగారెడ్డిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రేవంత్​ది తొండి రాజకీయం. ఆయన సవాల్​ను నేను స్వీకరిస్తున్న.. శుక్రవారం నేను అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్తూపం వద్దకు వస్త. కాంగ్రెస్ హామీల అమలుపై చర్చకు రేవంత్ వస్తారా? నా సవాల్​కు కాంగ్రెస్ సిద్ధమా?’’అని ప్రశ్నించారు. ‘‘ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రధాన హామీలపై ఆగస్టు 14 అర్ధరాత్రి దాకా సీఎంకు గడువు ఇస్తున్న. హామీలను అమలు చేస్తే నేను రాజీనామా చేస్తా. లేకుంటే రేవంత్ సీఎం పదవికి రిజైన్ చేయాలి. డిసెంబర్ 9వ తేదీనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నరు. నాలుగు నెలలైనా విధి విధానాలు ఖరారు చేయలేదు. ఇప్పుడు మళ్లీ కొత్త గడువు పెడ్తున్నరు. డిసెంబర్ 9న రుణమాఫీ చేయనందుకు రైతులందరికీ రేవంత్ బహిరంగ క్షమాపణ చెప్పాలి’’అని హరీశ్​రావు డిమాండ్ చేశారు. 

చేతగాకపోతే తప్పుకోండి

ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని హరీశ్ డిమాండ్ చేశారు. చేతగాకపోతే రేవంత్ సీఎం పదవి నుంచి తప్పుకోవాలన్నారు. హామీలపై ప్రశ్నిస్తే తమపైనే ఎదురుదాడి చేయడం సరికాదని విమర్శించారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2,500, కల్యాణ లక్ష్మి కింద రూ.లక్షతో పాటు తులం బంగారం, ఎకరానికి రూ.15వేల రైతు భరోసా, క్వింటాల్ పంటకు రూ.500 బోనస్, వ్యవసాయ కూలీలకు రూ.12వేలు, చేయూత పథకం కింద రూ.2వేల పింఛన్​ను రూ.4వేలకు పెంచాలని, ఆగస్టు 15 డెడ్​లైన్ అని అన్నారు. యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని మండిపడ్డారు. గ్యారంటీలన్నీ వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన సోనియా గాంధీ కూడా మాట తప్పారన్నారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్​పర్సన్ మంజుశ్రీ, జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ పాల్గొన్నారు