డబుల్ ఇంజన్ సర్కార్ అంటే స్కీంలు రద్దు చేసుడా

డబుల్ ఇంజన్ సర్కార్ అంటే స్కీంలు రద్దు చేసుడా

సంగారెడ్డి, వెలుగు:ఉచితంగా ఏది ఇవ్వకూడదనే ప్రధాని మోడీ మాటలు పాటించాలంటే రాష్ట్రంలో పేదల కోసం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు రద్దు చేసుకోవడమే అవుతుందని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అన్నారు. ఉచితాలు బంద్ చేయాలంటే కేసీఆర్ కిట్ బంద్ చేయాలా, రేషన్ బియ్యం బంద్ చేయాలా.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ బంద్ చేయాలా అని ప్రశ్నించారు. మంగళవారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆయన సంగారెడ్డి, పటాన్ చెరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన సభలో హరీశ్ మాట్లాడుతూ డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ప్రభుత్వ పథకాలు రద్దు చేయడమేనా అని ప్రశ్నించారు. ఫ్రీగా ఇవ్వడం బంద్ చేస్తే ఉచిత కరెంట్, పింఛన్లు కూడా ఆగిపోతాయని గుర్తు చేశారు.

సీఎం కేసీఆర్ సంపద పెంచి పేదలకు పంచి ఇస్తుంటే కేంద్రంలో కూర్చున్న పెద్దలు సంపద కొల్లగొట్టి పెద్ద గద్దలకు దోచి పెడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి గురించి ఆయా పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రానికి సూచించారు. రాష్ట్రంలో బీజేపీ నాయకత్వానికి చేతనైతే కేంద్రం నుంచి వరద సాయం అందేలా చూడాలని అన్నారు. వరదలు వస్తే ప్రజలను ఆదుకోవడం తెలియదు గాని బురద రాజకీయాలు మాత్రం చేస్తున్నారని విమర్శించారు. బాధితులకు ఇప్పటివరకు బీజేపీ నేతలు ఏం సాయం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, చింత ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.