వరి ఉత్పత్తిలో మనది సెకండ్ ప్లేస్: హరీశ్ రావు 

 వరి ఉత్పత్తిలో మనది సెకండ్ ప్లేస్: హరీశ్ రావు 

హైదరాబాద్, వెలుగు: గడిచిన 8ఏండ్లలో రాష్ట్రంలోని వ్యవసాయ రంగ స్వరూపం పూర్తిగా మారిపోయిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం అబిడ్స్​లోని రెడ్డి హాస్టల్​లో జరిగిన కార్యక్రమంలో అగ్రికల్చర్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ డైరీ, క్యాలెండర్​ను మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు. 2014లో 68 లక్షల టన్నులున్న వరి ధాన్యం ఉత్పత్తి.. 2022కు 2.49కోట్ల టన్నులకు చేరిందని హరీశ్ వెల్లడించారు. దేశంలోనే వరి ఉత్పత్తిలో  మన రాష్ట్రం  రెండో స్థానంలో ఉందన్నారు. ఒకప్పుడు ఆకలి చావులు, ఆత్మహత్యలు, అంబలి కేంద్రాల తెలంగాణ.. ఇప్పుడు పక్క రాష్ట్రాలకు బియ్యం ఇచ్చే స్థాయికి ఎదిగిందన్నారు. 9 మంది జిల్లా వ్యవసాయ ఆఫీసర్లున్న చోట.. 32 మంది పనిచేసేందుకు అవకాశం ఇచ్చామని తెలిపారు. వేల సంఖ్యలో ఏఈవోలను ప్రభుత్వం నియమించిందని తెలిపారు. ప్రపంచంలో నేరుగా రైతుల ఖాతాల్లోకి నిధులు జమచేస్తున్న ఏకైక పథకం రైతు బంధు అని..ఇప్పటివరకు రూ.65 వేల కోట్లు జమ చేశామని మంత్రి వివరించారు.

రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తున్నామని.. రూ.36 వేల కోట్లతో విద్యుత్ సదుపాయాలు కల్పించామని వెల్లడించారు. బోరుబావులకు మీటర్లు పెట్టనందుకు కేంద్రం రూ.30 వేల కోట్లు రాష్ట్రానికి రాకుండా నిలిపివేసిందని హరీశ్ ఆరోపించారు. ఎఫ్అర్ బీఎమ్ నుంచి15 వేల కోట్లు కోతవేసిందని మండిపడ్డారు. కార్పోరేట్ల అప్పులను మాఫీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. రైతుల అప్పులను ఎందుకు మాఫీ చేయట్లేదని ప్రశ్నించారు.  అగ్రికల్చర్‌  ఉద్యోగుల ప్రమోషన్లకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.