108 ఉద్యోగులకు గుడ్ న్యూస్..త్వరలో వేతనాలు పెరుగుతాయట

108 ఉద్యోగులకు గుడ్ న్యూస్..త్వరలో వేతనాలు పెరుగుతాయట

108 ఉద్యోగులకు 4 స్లాబులుగా వేతనాలు పెంచుతామని మంత్రి హరీష్ రావు తెలిపారు. రాష్ట్రం ఏర్పడినపుడు 108 వాహనాలు 321 వాహనాలుంటే ఇపుడు రూ. 455 కు పెంచామన్నారు.   గతంలో తెలంగాణలో లక్ష జనాభాకు ఒక 108 వాహనం ఉంటే ఇపుడు ప్రతి 75 వేల మందికి ఒక 108 వాహనం ఉందన్నారు. పాత వాహనాల స్థానంలోనే అమ్మఒడి వాహనాలను ప్రారంభించామని పేర్కొన్నారు. వైద్య రంగంలో దేశానికే  తెలంగాణ ఆదర్శంగా నిలిచేలా ఎన్నో కార్యక్రమాలను  ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ వైద్యం పట్ట ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు. దేశంలోనే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఆదర్శప్రాయం అయిందని మంత్రి చెప్పారు. 

తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖలో సీఎం కేసీఆర్ ఐదు అంచెల వ్యవస్థను ఏర్పాటు చేశారని మంత్రి హరీష్ రావు తెలిపారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖను నీతి ఆయోగ్ సైతం అభినందించిందని గుర్తు చేశారు. మళ్లీ కరోనా లాంటి విపత్తులు వచ్చినా.. తెలంగాణ వైద్య ఆరోగ్య రంగం తట్టుకునేలా నిలిచిందని చెప్పారు. జననం నుంచి మరణం వరకు వైద్య, ఆరోగ్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. 

హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజాలో 108 అంబులెన్స్ లు, అమ్మఒడి వాహనాలను  సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మొత్తం 204 అంబులెన్స్ లు, 34 పరమపద వాహనాలు, 228 అమ్మఒడి వాహనాలకు జెండా ఊపి స్టార్ట్ చేశారు. ఈ  కార్యక్రమంలో వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు , ఇతర నేతలు పాల్గొన్నారు.