బీఆర్ఎస్ స్లోగన్స్ చేసే పార్టీ కాదు.. సొల్యూషన్ ఇచ్చే పార్టీ : హరీష్రావు

బీఆర్ఎస్ స్లోగన్స్ చేసే పార్టీ కాదు.. సొల్యూషన్ ఇచ్చే పార్టీ : హరీష్రావు

హైదరాబాద్ : నెరవేర్చలేని హామీలు, వెకిలి చేష్టలు చేయడమే ప్రతిపక్షాల పని అని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ కన్నా మెరుగైన పాలన ఎక్కడ ఉందో ప్రతిపక్ష నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పొలిటికల్ టూరిస్టులు రాష్ట్రానికి వస్తుంటారని కామెంట్స్ చేశారు. మొన్న అమిత్ షా, నిన్న ఖర్గే వచ్చి.. బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పేపర్ పై రాసిచ్చిన హామీలను చదివి వెళ్లారంటూ మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ కు చెందిన జాతీయ నాయకులకు తెలంగాణ రాష్ట్రంపై ఎలాంటి అవగాహన లేదన్నారు. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆయుష్ ఇంటిగ్రేటెడ్ వెల్ నెస్ సెంటర్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై మండిపడ్డారు. 

తెలంగాణ అభివృద్ధి విషయంలో మాటలు కాకుండా చర్చకు రావాలని మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. వైద్య ఆరోగ్య రంగంలో దేశంలోనే తెలంగాణ 3వ స్థానంలో ఉందన్నారు. తలసారి ఆదాయంలోనూ భారతదేశంలో నెంబర్ వన్ గా తెలంగాణ ప్రభుత్వం ఉందని చెప్పారు. కేవలం తెలంగాణ రాష్ట్రానికే కాకుండా.. దేశానికే అన్నం పెట్టే స్థాయికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామన్నారు. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, హ్యాట్రిక్ కొట్టబోతుందని చెప్పారు. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ రానున్నారని చెప్పారు. బీఆర్ఎస్.. స్లోగన్ లు చేసే పార్టీ కాదు.. సొల్యూషన్ ఇచ్చే పార్టీ మాది అని అన్నారు.