మాది స్లోగన్ సర్కారు కాదు.. సొల్యూషన్ సర్కార్

మాది స్లోగన్ సర్కారు కాదు.. సొల్యూషన్ సర్కార్
  • మాది స్లోగన్ సర్కారు కాదు.. సొల్యూషన్ సర్కార్
  • కాంగ్రెస్, బీజేపీవి నకిలీ హామీలు: మంత్రి హరీశ్ రావు 
  • నిమ్స్​లో ఆయుష్ వెల్‌‌నెస్ సెంటర్ ఓపెన్ 

హైదరాబాద్, వెలుగు : తమది స్లోగన్ సర్కారు కాదని.. సొల్యూషన్ సర్కారని మంత్రి హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్, బీజేపీ కేవలం నినాదాలు చేసే పార్టీలని.. బీఆర్ఎస్ మాత్రమే నినాదాలను నిజం చేసే పార్టీ అని తెలిపారు. నకిలీ హామీలు, వెకిలి చేష్టలతో  ఆ రెండు పార్టీలు ప్రజలను  తప్పు దోవ పట్టిస్తున్నాయని ఫైర్ అయ్యారు. గురువారం నిమ్స్ లో ఆయుష్ హెల్త్ అండ్ వెల్‌‌నెస్ సెంటర్‌‌ను మంత్రి ప్రారంభించి, మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలు చెప్పే డిక్లరేషన్లను నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరని హరీశ్ రావు తెలిపారు. బీఆర్ఎస్ కే మూడోసారి అధికారమివ్వాలని రాష్ట్ర ప్రజలు ఎప్పుడో సెల్ఫ్  డిక్లరేషన్ చేసుకున్నారని చెప్పారు. అమిత్ షా, ఖర్గే రాష్ట్రానికి టూరిస్టుల్లా  వచ్చారని..ఇక్కడి నేతలు రాసిచ్చిన తప్పుడు స్క్రిప్ట్ చదివి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. తన సొంత రాష్ట్రమైన గుజరాత్ లో బీజేపీ పాలనను దారిలో పెట్టడం చేతగాని అమిత్ షా ఇక్కడికి వచ్చి అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తే ఎవరు నమ్ముతారన్నారు. ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే తన సొంత రాష్ర్టం కర్నాటకలో పరిస్థితులను చక్కదిద్ది ఇక్కడ మాట్లాడాలని హరీశ్ రావు సూచించారు.  కేసీఆర్ ను విమర్శించాలని వచ్చేవారు తెలంగాణ కన్నా ఎక్కువ అభివృద్ధి సంక్షేమం చేసి ఉండాలని తెలిపారు. తమ రాష్ట్రాలను పట్టించుకోకుండా.. ఇక్కడకొచ్చి ఏది మాట్లాడినా జనాలు నమ్ముతారనుకుంటే  పొరపాటేనని మంత్రి తెలిపారు.

స్టేట్ లో ఇదే ఫస్ట్ సెంటర్ 

రాష్ర్టంలో తొలిసారిగా ఆయుష్  వెల్ నెస్ ఏర్పాటు చేశామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఆయుర్వేదం, యునాని, హోమియోపతి, సిద్ధ, ప్రకృతివైద్యం వంటి అన్ని వైద్య విధానాలు ఒకే వేదికగా అందుబాటులో ఉంటాయన్నారు. నిపుణులైన ఆయుష్ వైద్యుల ఆధ్వర్యంలో ఆయుర్వేద, ప్రకృతి వైద్య ప్రక్రియలు, చికిత్సలను నిర్వహించడానికి అత్యాధునిక సౌకర్యాలను ఏర్పాటు చేశామని వివరించారు. నిమ్స్ వెల్ నెస్ సెంటర్ ద్వారా విశ్రాంత సివిల్ సర్వెంట్లు, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, ప్రస్తుతం వివిధ హోదాల్లో విధులను నిర్వర్తిస్తున్న వారు ట్రీట్ మెంట్ పొందుతున్నారని చెప్పారు. ప్రభుత్వం వైద్యాన్ని  ఎంతో ప్రోత్సహిస్తున్నదని, ఇందులో భాగంగా ఇటీవల రూ. 10 కోట్లతో నేచర్ క్యూర్ ఆసుపత్రిని రెనోవేట్ చేశామని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో 834 ఆయుష్ డిస్పెన్సరీలు, 5 కాలేజీలు, 4 రీసెర్చ్ హాస్పిటల్స్ ఉన్నాయని మంత్రి వెల్లడించారు. వికారాబాద్, భూపాలపల్లి, సిద్దిపేటలో 50 పడకల కొత్త ఆయుష్ ఆసుపత్రుల నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ లు, బస్తీ దవాఖానలు ఇలా పట్టణం నుంచి పల్లె దాకా ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేశామని హరీశ్ రావు పేర్కొన్నారు.