
హైదరాబాద్, వెలుగు: మంకీపాక్స్ గురించి అనవసరంగా ఆందోళన చెందవద్దని ప్రజలకు మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, అనుమానిత కేసులు లేవని చెప్పారు. విదేశాల నుంచి వచ్చినవాళ్లలో ఎవరికైనా మంకీపాక్స్ లక్షణాలు కనిపిస్తే దగ్గర్లోని ప్రభుత్వ దవాఖానలో సంప్రదించాలని, మంకీపాక్స్ కేసులు నమోదైన దేశాల నుంచి తిరిగొచ్చిన వారు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మంకీపాక్స్, సీజనల్ డిసీజెస్, కరోనా వ్యాక్సినేషన్, వరద ప్రభావిత ప్రాంతాల్లో హెల్త్ క్యాంపుల వివరాలు, సలహాల కోసం 040 2465 1119, 90302 27324 నంబర్లలో సంప్రదించాలన్నారు. మంకీపాక్స్ లక్షణాల విషయంలో క్షేత్రస్థాయి వైద్య సిబ్బందికి అవగాహన కల్పించాలని హెల్త్ ఆఫీసర్లను మంత్రి ఆదేశించారు. ఆఫీసర్లతో కలిసి ప్రభుత్వ డాక్టర్లతో మంత్రి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో మంకీపాక్స్ కేసులు లేకపోయినా అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లకు మంత్రి సూచించారు.
నోడల్ సెంటర్‌గా ఫీవర్ హాస్పిటల్ ఎంపిక
‘‘మంకీపాక్స్ లక్షణాలు ఉన్నవారికి ట్రీట్‌మెంట్ అందించేందుకు హైదరాబాద్‌లోని ఫీవర్ హాస్పిటల్‌ను నోడల్ సెంటర్‌గా ఎంపిక చేశాం. మంకీపాక్స్ అనుమానితుల సాంపుల్స్‌ను గాంధీ హాస్పిటల్‌లో టెస్ట్ చేయిస్తాం. పాజిటివ్ వస్తే పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపిస్తాం. వర్షాలు, వరదల కారణంగా సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉంది. రాబోయే వారం పది రోజులు అన్ని దవాఖానల్లో డాక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణ డయాగ్నస్టిక్స్ సెంటర్లు 24 గంటలు పని చేయాలి. ఫలితాలను వేగంగా ఇవ్వాలి. ఇన్‌పేషెంట్లకు మంచి డైట్ అందించాలి. డైట్ మెనూను ప్రతి హాస్పిటల్‌లో ప్రదర్శించేలా బోర్డులుపెట్టాలి’’ అని మంత్రి చెప్పారు.