దేశంలో హోల్ సేల్ ధరల సూచీ(WPI) ఆధారిత ద్రవ్యోల్బణం నవంబర్‌లో –0.32 శాతానికి పెరిగింది, అంతకుముందు అక్టోబర్‌లో నమోదైన –1.21 శాతం నుండి ఇది గణనీయమైన మెరుగుదల. దీనితో కొన్ని వస్తువుల ధరలు ఇంకా బలహీనంగా ఉన్నప్పటికీ.. దేశంలో నెలకొన్న ద్రవ్యోల్బణం ఒత్తిడి నెమ్మదిగా తగ్గుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. అక్టోబర్‌లో టోకు ధరలు 12 నెలల కనిష్ట స్థాయికి పడిపోయిన తరువాత.. ఈ పెరుగుదల మారుతున్న పరిస్థితులను సూచిస్తుంది. హోల్ సేల్ ధరలు ఇంకా 'నెగెటివ్ టెరిటరీ'లోనే ఉన్నప్పటికీ నవంబర్ గణాంకాలు ద్రవ్యోల్బణ ప్రభావం దాని అత్యంత దారుణమైన దశను దాటినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
హోల్ సేల్ ద్రవ్యోల్బణాన్ని బాగా ప్రభావితం చేస్తున్న ఆహార వస్తువుల ధరల్లో పతనం తీవ్రత తగ్గింది. నెలల తరబడి తీవ్రంగా పడిపోయిన తర్వాత ప్రాథమిక వస్తువులు, ముఖ్యంగా ఆహార పదార్థాల ధరల క్షీణత వేగం తగ్గడమే WPI పెరగడానికి ప్రధాన కారణం. కూరగాయల ధరలు ఏడాది క్రితంతో పోలిస్తే ఇప్పటికీ 20 శాతం తక్కువగానే ఉన్నాయి. అయితే అక్టోబర్‌లో నమోదైన దాదాపు 35 శాతం పతనం కంటే ఇది మెరుగైన పరిస్థితిగా చెప్పుకోవచ్చు. ఉల్లిపాయలు, బంగాళాదుంపల సప్లై మెరుగుదల కారణంగా ఏడాది క్రితంతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి.
అలాగే ఏడాది మొదటి భాగంలో ద్రవ్యోల్బణానికి మద్దతు ఇచ్చిన ధాన్యాల ధరలు నవంబర్‌లో ప్రతికూలంగా మారాయి. గోధుమల ధరలు కూడా కొద్దిగా ప్రతికూలతను చూశాయి. పప్పుధాన్యాల సప్లై మెరుగుపడటం వల్ల వాటి రేట్లు కూడా తగ్గుతూనే ఉన్నాయి. అయితే నూనెగింజల ధరలు.. సప్లై సమస్యలు, అంతర్జాతీయ సంకేతాల కారణంగా నవంబర్‌లో భారీగానే పెరిగాయి. అలాగే, ఖనిజాల ద్రవ్యోల్బణం కూడా బలపడింది. ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్బణం వరుసగా మరో నెల కూడా ప్రతికూలంగానే ఉన్నాయి. అయితే తగ్గుదల వేగం తగ్గింది.
WPIలో అత్యధిక వెయిటేజీ ఉన్న తయారీ వస్తువుల ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గింది. రసాయనాలు, ఔషధాలు, వస్త్రాలు, ప్రాథమిక లోహాల వంటి ప్రధాన తయారీ కేటగిరీలలో ధరల పెరుగుదల చాలా తక్కువగా ఉంది.
