కాళేశ్వరానికి అన్ని అనుమతులు ఉన్నట్లు షెకావతే చెప్పిండు

కాళేశ్వరానికి అన్ని అనుమతులు ఉన్నట్లు షెకావతే చెప్పిండు

కాళేశ్వరం తెలంగాణ లైఫ్ లైన్ అని మంత్రి హరీష్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ నేతలు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. 2022 జనవరిలో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కాళేశ్వరానికి అన్ని అనుమతులు ఉన్నాయని పార్లమెంట్ లో ప్రకటించారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని కూడా షేకావత్ చెప్పారని తెలిపారు. కానీ యాదగిరి గుట్ట బీజేపీ సభలో మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. కేంద్రమంత్రి అయివుండి అసత్యాలు మాట్లాడుతున్నారని.. రాజకీయ లబ్ది కోసమే అబద్ధాలని మండిపడ్డారు. మేడ్చల్ లో మాతాశిశు సంక్షేమ ఆస్పత్రికి మంత్రి శంకుస్థాపన చేశారు.

బీజేపీ ఎయిమ్స్ పరువు తీస్తోంది

ప్రజలకు ఉచిత పథకాలు వద్దని ప్రధాని అనడం దురదృష్టకరమని హరీష్ రావు అన్నారు. పారిశ్రామికవేత్తల కోసమే మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. బీబీనగర్ ఎయిమ్స్ లో కేంద్ర ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించలేదన్నారు. బీజేపీ ఎయిమ్స్ పరువు తీస్తోందని..ఎయిమ్స్ పరిస్థితి పేరు గొప్ప..ఊరు దిబ్బగా మారిందన్నారు. ఎయిమ్స్ లో ఒక్క డెలవరీ కాలేదన్న మంత్రి పక్కనే ఉన్న పీహెచ్సీలో 11డెలవరీలు అయినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో 57 రకాల వైద్య పరీక్షలు పైసా ఖర్చు లేకుండా చేస్తున్నట్లు వివరించారు. 

నార్మల్ డెలవరీ చేస్తే 3వేలు

ప్రభుత్వాసుపత్రిల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఒక్క పైసా ఖర్చవకుండా 12వేల 500రూపాయలు, కేసీఆర్ కిట్ ఇచ్చి బాలింతలను ఆస్పత్రి నుంచి ఇంటికి పంపిస్తున్నామన్నారు. కొందరు ముహుర్తాలు చూస్తూ కాన్పు చేయాలని డాక్టర్ల మీద ఒత్తిడి తెస్తున్నారని..ఇది మంచి పద్ధతి కాదన్నారు. దీని వల్ల లేనిపోని చిక్కులు తెచ్చుకుంటూ తల్లి బిడ్డకు అన్యాయం చేస్తున్నారని చెప్పారు. ఆస్పత్రుల్లో నార్మల్ డెలవరీ చేస్తే డాక్టర్ సహా సిబ్బందికి 3వేలు చొప్పున అందిస్తామని మంత్రి తెలిపారు. మహిళల్లో రక్తహీనతను అధిగమించేందుకు త్వరలో కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్ అందించబోతున్నట్లు చెప్పారు.