
కేంద్ర ప్రభుత్వంపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. అధికార దాహం , రాజకీయ లబ్ది కోసమే కేంద్రం ఉప ఎన్నికలు తెస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గతంలో తాము ఉప ఎన్నికలు తెస్తే.. బీజేపీ ఇప్పుడు ఎందుకు తెస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఐటీఐఆర్ ను రద్దు చేసిన కేంద్రం కోచ్ ఫ్యాక్టరీ కూడా ఇవ్వడం లేదని, ఉపాధి హామీ పథకాన్ని కూడా రద్దు చేసే ప్రయత్నం చేస్తోందని హరీష్ రావు ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరినా పట్టించుకోవడం లేదని వాపోయారు.
దశాబ్దాల కల నెరవేరింది
అంతకు ముందు మెదక్ పట్టణంలోని రైల్వే స్టేషన్ లో కొత్త ఎరువుల రెక్ పాయింట్ ను మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి హరీష్ రావు ప్రారంభించారు. మెదక్ లో రెక్ పాయింట్ దశాబ్దాల కల అన్న ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్ల వాటా కేటాయించినందుకే మెదక్ కు రైలు వచ్చిందని అన్నారు. గతంలో ఎరువుల కోసం సనత్ నగర్ వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ ఇబ్బంది తప్పిందని అన్నారు.
రాష్ట్రంలోనే ఎక్కువ పథకాల అమలు
దేశంలో రైతుల కోసం ఎక్కవ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ మూడుసార్లు ప్రాతినిధ్యం వహించిన గుజరాత్ లో కూడా ఇన్ని పథకాలు లేవని అన్నారు. మెదక్ కు రైల్వే లైన్ తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. రాష్ట్రంలో రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలు చూసి కర్నాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలను తెలంగాణలో కలపమని కోరుతున్నారని నిరంజన్ రెడ్డి చెప్పారు. ప్రధాని సొంత రాష్ట్రంలో ఫసల్ బీమా పథకం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రైతులు పండించిన పంట కొనేందుకు కూడా కేంద్రం ఇబ్బందులు పెడుతోందని అన్నారు.
మెదక్ రూపురేఖలు మార్చిన కేసీఆర్
మెదక్ అక్కన్న పేట రైల్వే లైన్ కోసం వందలాది లెటర్లు రాసి కొట్లాడి సాధించుకున్నామని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెదక్ రూపరేఖలే మారిపోయాయని చెప్పారు. గత ప్రభుత్వాలు మెదక్ ను నిర్లక్ష్యం చేశాయని, కానీ ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి చూసి ప్రజలు మూడోసారి కూడా టీఆర్ఎస్ కు కట్టబెడతారని కొత్త ప్రభాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అక్కన్నపేట రైల్వే లైన్ ను మరింత పొడగిస్తామని చెప్పారు.