పోరాడి తెచ్చుకున్న తెలంగాణ.. కేసీఆర్ చేతిలో ఉంటేనే బాగుంటది: హరీష్ రావు

 పోరాడి తెచ్చుకున్న తెలంగాణ.. కేసీఆర్ చేతిలో ఉంటేనే బాగుంటది: హరీష్ రావు

పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ,, ఉద్యమ నాయకుడు కేసీఆర్ చేతిలో ఉంటే బాగుంటుందని మంత్రి హరీష్ రావు అన్నారు.  వేరే వాళ్ళ చేతిలోకి పోతే రాష్ట్రం ఆగం అవుతుందని చెప్పారు.   సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్న చల్మేడలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి భూమిపూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..  సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పూర్తయితే సంగారెడ్డి జిల్లా సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి భూములు ఇచ్చిన రైతులకు కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని మంత్రి వెల్లడించారు.  

రెండేళ్లలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి రైతులకు సాగునీరందిస్తామని ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు వెల్లడించారు.  తెలంగాణ రావడం, కేసీఆర్‌ సీఎం కావడం వల్లే ఈ ప్రాజెక్టు వచ్చిందన్నారు.  సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం రూ.2,653 కోట్లతో నిర్మిస్తున్నదన్న హరీష్ రావు ... 19లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో పథకానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు. ఎత్తిపోతల పథకం కోసం ప్రభుత్వం కాళేశ్వరం నుంచి 12టీఎంసీలను కేటాయించింది.

పేదలు, రైతుల సంక్షేమమే ఎజెండాగా ప్రభుత్వం పని చేస్తుందని హరీష్ రావు చెప్పారు.  ఆనాటి ప్రభుత్వాలు వ్యవసాయం దండగంటే..  కేసీఆర్ మాత్రం వ్యవసాయాన్ని పండగ చేసి చూపించారని అన్నారు. గత ప్రభుత్వాలు  సంగారెడ్డి జిల్లాలో సింగూరు కట్టి నీళ్లు మాత్రం హైదరాబాద్ తీసుకుపోయిందని హరీష్ రావు ఆరోపించారు. భూములు మనవైతే..  నీళ్లు వాళ్ళు తీసుకుపోయారని అన్నారు.  ఎన్నికలప్పుడు చాలా మంది వస్తుంటారని వారి మాటలను పట్టించుకోవద్దని చెప్పారు.