నాంపల్లి గ్రౌండ్‭లో నుమాయిష్ ప్రారంభం

నాంపల్లి గ్రౌండ్‭లో నుమాయిష్ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నుమాయిష్ షురూ అయింది. ఆదివారం హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి 82వ ఎడిషన్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన రైలు బండిలో సరదాగా ప్రయాణించారు. స్టాళ్లను సందర్శించి వివిధ రాష్ట్రాల ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. 1938లో ప్రారంభమైన నుమాయిష్‌కు దేశంలో ఎంతో ఆదరణ ఉందన్నారు. నుమాయిష్ లాంటి ఎగ్జిబిషన్‌కు రాకుంటే ఓ మంచి అనుభూతిని కోల్పోతామన్నారు. సామాజిక అనుబంధాన్ని మిస్​అవుతామని చెప్పారు. వివిధ సంస్కృతులు, ఆహారపు అలవాట్లను స్వయంగా చూసే చాన్స్ కు దూరమవుతామని, కాబట్టి అందరూ వచ్చి నుమాయిష్ ఎగ్జిబిషన్‌ను ఆస్వాదించాలని కోరారు. దేశం నలుమూలల నుంచి ప్రజలు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. ఎగ్జిబిషన్ సొసైటీ, ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ కలిసి రాష్ట్రంలో 19 విద్యా సంస్థలకు నిధులను ఇస్తున్నదని హరీశ్ కొనియాడారు. ఆ నిధులతో 30 వేల మంది విద్యార్థులకు చదువును చెప్పిస్తున్నారన్నారు. 

హరీశ్‌కు చెప్తే సీఎం కేసీఆర్‌‌కు చెప్పినట్టే: తలసాని

నుమాయిష్​ ఎగ్జిబిషన్ సొసైటీకి ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గతంలో ఎగ్జిబిషన్ స్థలం విషయంలో సీఎం కేసీఆర్ చొరవ చూపించారని గుర్తుచేశారు. ఎగ్జిబిషన్ సొసైటీకి మంత్రి హరీశ్ రావు అధ్యక్షుడిగా ఉండడం అదృష్టమని, ఏ విషయమైనా హరీశ్‌కు చెప్తే సీఎం కేసీఆర్‌‌కు చెప్పినట్టేనని పేర్కొన్నారు. ఎగ్జిబిషన్‌తో వచ్చిన డబ్బును పేద విద్యార్థుల చదువు కోసం ఖర్చు చేయడం మంచి నిర్ణయమని మంత్రి మహమూద్ అలీ అన్నారు. తన చిన్నప్పటి నుంచి ఎగ్జిబిషన్‌ను చూస్తున్నానని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. 

46 రోజుల పాటు నిర్వహణ..

జనవరి 1న ప్రారంభమైన నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌ ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు జరగనుంది. ఇందులో 1,500 మంది ఎగ్జిబిటర్లు 2,400 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఎంట్రీ టికెట్ ధరను రూ.40గా నిర్ణయించారు. ఐదేండ్ల లోపు పిల్లలను లోపలికి ఉచితంగా అనుమతించనున్నారు. రోజూ మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 10.30 వరకు సందర్శకులకు అనుమతిస్తారు. సందర్శకుల రద్దీతో హైదరాబాద్ మెట్రో రైల్ అదనపు సర్వీసులతో పాటు ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడిపేందుకు నిర్ణయించింది. ఎగ్జిబిషన్‌ జరిగే రోజుల్లో నాంపల్లి గ్రౌండ్స్‌ వద్ద ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.