- ఇక గ్రోక్లో అశ్లీల ఫొటోలు క్రియేట్ చేయలేరు
- కేంద్ర ప్రభుత్వానికి ‘ఎక్స్’ వివరణ
న్యూఢిల్లీ: ఏఐ ప్లాట్‌ఫామ్ ‘గ్రోక్’ను వాడి అసభ్య, అశ్లీల, చట్టవిరుద్ధ కంటెంట్‌ను సృష్టిస్తున్న 600 అకౌంట్లను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ డిలీట్ చేసింది. అదేవిధంగా, 3,500 పోస్టులను బ్లాక్ చేసింది. గ్రోక్ వేదికపై అసభ్యతకు తావివ్వబోమని, ప్రభుత్వ నిబంధనలను పాటిస్తామని హామీ ఇచ్చింది. తమ వైపు నుంచే పొరపాటు జరిగిందని అంగీకరించింది. కాగా, ఎలాన్ మస్క్‌కు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’కు అనుబంధంగా ఉన్న గ్రోక్ సాయంతో ఇటీవల కొందరు అసభ్యకర చిత్రాలు సృష్టించారు. రాజకీయ నేతలు, సెలబ్రెటీలు, సినీ నటుల ఫొటోలను ఇబ్బందికరంగా మార్ఫింగ్ చేసి పోస్ట్ చేయడం వివాదాస్పదమైంది. ఈ అంశాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటీ మంత్రిత్వ శాఖ సీరియస్‌గా తీసుకున్నది. 72 గంటల్లో ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని ‘గ్రోక్’కు ఆదేశాలు జారీ చేసింది. అలాంటి అకౌంట్లను వెంటనే డిలీట్ చేసి, పోస్టులను బ్లాక్ చేయాలని సూచించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
నిబంధనలు కఠినతరం చేసినం
ప్రపంచవ్యాప్తంగా ఈ అంశంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో రంగంలోకి దిగిన ‘గ్రోక్’ టెక్నికల్ టీమ్.. 600 అకౌంట్లను డిలీట్ చేసింది. వీళ్లు షేర్ చేసిన 3,500 పోస్టులను బ్లాక్ చేసింది. ఇకపై గ్రోక్ వేదికగా ఎలాంటి అసభ్య, చట్టవిరుద్ధమైన, అశ్లీల ఫొటోలు, వీడియోలు క్రియేట్ చేసే అవకాశంలేదని స్పష్టం చేసింది. కఠినమైన నిబంధనలు పెట్టకపోవడంతోనే కొందరు ఏఐ బేస్డ్ గ్రోక్‌ను ఁమిస్ యూజ్ చేశారని విచారం వ్యక్తం చేసింది. యూజర్ పాలసీలు మరింత కఠినతరం చేశామని ప్రకటించింది. ప్రీమియం యూజర్లకు మాత్రమే ఫొటోలు, వీడియోలు క్రియేట్ చేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. యూజర్ల డేటాను భద్రపర్చేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
మహిళల గౌరవానికి భంగం వాటిల్లదు
మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్న డీప్‌ఫేక్ లేదా అశ్లీల చిత్రాల క్రియేషన్ ను అడ్డుకుంటామని ఇండియాకు ‘గ్రోక్’ తెలిపింది. ఎవరైనా గ్రోక్ ను ఉపయోగించి ఇల్లీగల్ కంటెంట్ సృష్టించాలని చూస్తే, వారిని క్రిమినల్స్ గా పరిగణించి అకౌంట్లను బ్యాన్ చేస్తామని చెప్పింది. ‘‘ఇమేజ్ జనరేషన్ టూల్ లోని కొన్ని ఫిల్టర్లను అప్డేట్ చేస్తున్నం. ఇలా చేయడంతో అసభ్యకరమైన పదాలు ఇస్తే ఏఐ.. ఫొటోలు, వీడియోలను క్రియేట్ చేయలేదు’’ అని గ్రోక్ వెల్లడించింది.
