మాపై అటాక్ చేస్తే అమెరికా బేస్‌‌లను లేపేస్తం..ఇజ్రాయెల్‌‌పైనా దాడులకు దిగుతం.. ఇరాన్ వార్నింగ్‌‌

మాపై అటాక్ చేస్తే అమెరికా బేస్‌‌లను లేపేస్తం..ఇజ్రాయెల్‌‌పైనా దాడులకు దిగుతం.. ఇరాన్ వార్నింగ్‌‌
  •     ఇజ్రాయెల్​పైనా దాడులకు దిగుతం: ఇరాన్ స్పీకర్ హెచ్చరిక 
  •     దేశవ్యాప్తంగా నిరసనలు..
  •      116కు పెరిగిన మృతుల సంఖ్య.. 2,600 మంది అరెస్ట్
  •     ఫోన్, ఇంటర్నెట్ సేవలు బంద్


పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్‌‌లో అంతర్గత నిరసనలు చినికి చినికి గాలివానలా మారి, అమెరికాకు, ఇరాన్‌‌కు మధ్య ప్రత్యక్ష యుద్ధ సంకేతాలకు దారితీస్తున్నాయి. ఇరాన్ ప్రభుత్వం నిరసనకారులను కాల్చి చంపితే వారికి మద్దతుగా తాము వస్తామంటూ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ గట్టి కౌంటర్ ఇచ్చింది.‘‘అమెరికా గనుక మాపై దాడికి దిగితే.. మిడిల్ ఈస్ట్‌‌లోని యూఎస్ మిలిటరీ బేస్‌‌లను, యుద్ధ నౌకలను నామరూపాలు లేకుండా చేస్తాం. ఇజ్రాయెల్‌‌ను టార్గెట్ చేస్తాం’’ అంటూ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ బఘేర్ ఖాలిబఫ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

టెహ్రాన్/వాషింగ్టన్: అమెరికా తమపై దాడి చేస్తే.. తాము మిడిల్ ఈస్ట్ లోని యూఎస్ మిలిటరీ బేస్ లు, షిప్పులపై, ఇజ్రాయెల్ పై అటాక్ చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ ప్రభుత్వం నిరసనకారులను కాల్చి చంపితే వారికి మద్దతుగా తాము వస్తామంటూ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఖాలిబఫ్ ఈ మేరకు స్పందించారు. దేశంలో వెల్లువెత్తుతున్న నిరసనలపై చర్చించేందుకు పార్లమెంట్ సభ్యులు ఆదివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఖాలిబఫ్ మాట్లాడుతూ.. తమ దేశంపై దాడి చేస్తే.. తామూ ప్రతిదాడులకు దిగుతామని స్పష్టం చేశారు. నిరసనల సమయంలో పోలీసులు, పారామిలిటరీ (రెవెల్యరూషనరీ గార్డులు), బాసిజ్ వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారని ఆయన ప్రశంసించారు. ‘‘నిరసనలకు దిగి అరెస్ట్ అయినవాళ్లపై మేం చాలా కఠినంగా వ్యవహరిస్తామన్నది ఇరాన్ ప్రజలు తెలుసుకోవాలి” అని ఖాలిబఫ్ హెచ్చరించారు.

 రగులుతున్న ఇరాన్

ఇరాన్ కరెన్సీ రియాల్ దారుణంగా పతనం కావడం, ధరలు విపరీతంగా పెరగడంతో సుప్రీం లీడర్ ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పోయిన నెల 28 నుంచి మొదలైన నిరసనలు ఆదివారం నాటికి రెండు వారాల్లో దేశంలోని అన్ని ప్రాంతాలకూ వ్యాపించాయి. టెహ్రాన్ తోపాటు పలు ప్రాంతాల్లో నిరసనకారులు వీధుల్లో టైర్లు, వస్తువులు కాల్చి నిప్పు పెట్టడం, ర్యాలీలు తీయడం, పలు చోట్ల భారీగా బలగాలను మోహరించి ఉన్న వీడియో క్లిప్​లు మాత్రం సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చాయని యూఎస్​కు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఇక ఇరాన్ లో రెండు వారాలుగా జరుగుతున్న నిరసనల్లో పోలీసులు కాల్పులు, హింసాత్మక ఘటనల్లో మరణించిన వారి సంఖ్య 116కు పెరిగిందని ఆ న్యూస్ ఏజెన్సీ ఆదివారం వెల్లడించింది. అరెస్ట్ అయిన వారి సంఖ్య 2,600కు పెరిగిందని తెలిపింది.  కాగా, నిరసనకారులతో చర్చలు జరిపి, వారి విజ్ఞప్తులను పరిశీలించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్ ఆదివారం వెల్లడించారు.

దాడికి అమెరికా సిద్ధం? 

నిరసనకారులను అణచేయడంపై ఇరాన్ ను అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కొన్ని రోజులుగా హెచ్చరిస్తూ వస్తున్నారు. శనివారం కూడా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘‘ఇరాన్ స్వాతంత్ర్యం కోసం చూస్తోంది. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఈ ఉద్యమం ఉంది. సాయం చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉంది” అంటూ ఆయన పేర్కొన్నారు. దీంతో ఇరాన్ పై మిలిటరీ దాడికి సిద్ధంగా ఉండాలంటూ ట్రంప్ ఆదేశించారని, కానీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిసినట్టుగా యూఎస్ మీడియా సంస్థలు వెల్లడించాయి. 

ఇజ్రాయెల్ అలర్ట్ 

ఇరాన్​ హెచ్చరికల నేపథ్యంలో ఇజ్రాయెల్ అలర్ట్ అయింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఈ మేరకు శనివారం ఫోన్​లో మాట్లాడారు. ఇరాన్​లో అమెరికా జోక్యం చేసుకునే అవకాశంపై వీరు చర్చించినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.