మీరమ్మితే ఒప్పు.. మేమమ్మితే తప్పా?

V6 Velugu Posted on Jun 15, 2021

సంగారెడ్డి, సంగారెడ్డి టౌన్, వెలుగు: ‘‘ఉమ్మడి రాష్ట్రంలో సర్కారు భూములు కాంగ్రెసోళ్లు అమ్మి ఆంధ్రాకు పైసలు తరలిస్తే ఒప్పు అయితది.. అదే తెలంగాణ ప్రజల కోసం ఇక్కడి భూములు టీఆర్ఎస్ అమ్మితే తప్పయితదా?’’ అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ప్రతిపక్షాలు రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతున్నాయని విమర్శించారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లిలో సోమవారం సింగూరు బ్యాక్ వాటర్ పై సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సర్వే పనులను హరీశ్ ప్రారంభించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘‘2004–2014 మధ్యకాలంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి సీఎంలుగా ఉన్నప్పుడు 88,500 ఎకరాల ప్రభుత్వ భూములు అమ్మారు. ఆ టైంలో భట్టి విక్రమార్క డిప్యూటీ స్పీకర్ గా ఉన్న విషయాన్ని ఆయన మర్చిపోయినట్టు ఉన్నారు” అని ఎద్దేవా చేశారు.

పారదర్శకంగా భూముల వేలం

ప్రభుత్వ భూములు అమ్మవద్దని కాంగ్రెస్, బీజేపీ నాయకులు పనికిరాని ప్రకటనలు చేస్తున్నారని.. రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమ పథకాల అమలు కోసం భూములు అమ్ముతున్నామని హరీశ్​రావు చెప్పారు. కరోనా కారణంగా ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గిందని, అందుకే బీడు వారిన ప్రభుత్వ భూములను అమ్మి రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. చరిత్రలో కాంగ్రెస్, బీజేపీ ఎన్నడూ భూములు అమ్మనట్టు.. మేమే ఫస్ట్ టైం అమ్ముతున్నట్టు విడ్డురంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు ప్రతీది రాజకీయం చేయాలని చూస్తున్నాయని, కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అవగాహన లేకుండా ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. కరోనాతో రాష్ట్ర ఆదాయం తగ్గినా ప్రజలపై పన్నులు పెంచకుండా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ హయంలో పూర్తిగా పారదర్శకంగా భూముల వేలం జరుగుతుందని తెలిపారు. బీహెచ్ఈఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, వైజాగ్ స్టీల్, రైల్వేను కేంద్ర ప్రభుత్వం అమ్మాలని చూస్తోందని హరీశ్ విమర్శించారు. కానీ తాము కరోనా కష్టకాలంలో కూడా ఆర్టీసీని కాపాడుకున్నామన్నారు.

ఎస్సీ, ఎస్టీ రైతులకు ఫ్రీగా కంది విత్తనాలు

ప్రభుత్వం తరఫున పప్పులు, నూనెగింజల ఉత్పత్తిని పెంచడానికి రైతులను ప్రోత్సహిస్తున్నామని హరీశ్​రావు చెప్పారు. సోమవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్ మీటింగ్ హాల్​లో ఎస్సీ, ఎస్టీ సన్న, చిన్న కారు రైతులకు ఉచిత కంది విత్తనాల ప్యాకెట్లను పంపిణీ చేశారు. జిల్లాకు రూ.51 లక్షల విలువైన 554 క్వింటాళ్ల కంది విత్తనాలు కేటాయించినట్లు వెల్లడించారు. పొద్దుతిరుగుడు, పల్లీ ఇతర నూనె గింజల సాగు పెంచాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఈ ఖరీఫ్​లో 70 లక్షల ఎకరాల్లో పత్తి, 20 లక్షల ఎకరాల్లో కంది పండించాలని సీఎం నిర్ణయించినట్లు చెప్పారు. పప్పుదినుసులకు కేంద్రం మద్దతు ధర పెంచిందని మంత్రి హరీశ్​రావు గుర్తు చేశారు. పాశమైలారం కిర్బీ పరిశ్రమ యాజమాన్యం, అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ విరాళంగా ఇచ్చిన మెడికల్ ఎక్విప్‌మెంట్‌కు సంబంధించిన వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. 
 

Tagged sale, Minister Harish rao, response, government lands

Latest Videos

Subscribe Now

More News